సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సచివాలయ పోస్టుల భర్తీకి చకచకా అడుగులు పడుతున్నాయి. సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో కాల్ లెటర్లు అందుబాటులో ఉంచగా.. నేటి నుంచి (మంగళవారం) సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నట్టుగా మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో డీఎస్సీ (డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ) సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను నిర్వహిస్తుందని తెలిపారు. కేటగిరీల వారీగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడుతామని విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులు అర్హత, కుల ధృవీకరణ, రెసిడెన్షియల్, క్రిమీలేయర్ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. సర్టిఫికెట్లన్నింటినీ డీఎస్సీ వెరిఫికేషన్ చేస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో మెరిట్ లిస్టులు పూర్తి చేశామని తెలిపారు. వెరిఫికేషన్ పూర్తవ్వగానే అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు అందజేస్తామని వెల్లడించారు.
ఎవరూ ఆందోళన చెందవద్దు
నిబంధన ప్రకారం పనిచేసిన ఏఎన్‌ఎంలకు సచివాలయ పోస్టుల్లో దక్కాల్సిన వెయిటేజీపై ఆందోళన చెందవద్దని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అన్నారు. వెయిటేజీ ఇవ్వని వారి సర్టిఫికెట్లను సంబంధిత డీఎంఅండ్‌హెచ్‌ఓ(జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి) ఆఫీసులో మంగళవారం అంజేయాలని సూచించారు. వాటిని పరిశీలించిన తర్వాత వెయిటేజీ ఇస్తారని ఆయన తెలియజేశారు.
సర్టిఫికెట్ పరిశీలన కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
విజయవాడ: గ్రామ, వార్డు సచివాలయ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ మంగళశారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్... ఆంధ్ర లయోలా కాలేజీలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సర్టిఫికెట్ పరిశీలన కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలోని 11,025 పోస్టులకు అర్హులైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికెషన్ రెండు రోజుల పాటు జరుగుతుందని పేర్కొన్నారు. అయిదు శాఖలకు సంబంధించి అర్హత సాధించిన వారికి నేడు సర్టిఫికెట్స్ పరిశీలన చేపడుతారని వెల్లడించారు.
గ్రామ, వార్డు సచివాలయ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల అనుమానాలు నివృత్తి చేసేందుకు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని ఇంతియాజ్ పేర్కొన్నారు. అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శాఖల వారీగా కౌంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియకుగానూ తొలి రోజు 250 మంది అధికారులు విధుల్లో పాల్గొంటున్నారని చెప్పారు. వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన పత్రాలతో అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు. అక్టోబర్ రెండవ తేదీ కల్లా అభ్యర్థులు కొత్త కొలువుల్లో చేరేలా ఏర్పాట్లు పూర్తి చేశామని ఇంతియాజ్ అన్నారు.
అనంతపురం: సచివాలయ ఉద్యోగాల భర్తీ సజావుగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. కాల్‌లెటర్స్ అందినవారంతా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని సూచించారు. కాల్ లెటర్స్ అందనివారికి త్వరలోనే పంపుతామని స్పష్టం చేశారు. ఇక జిల్లావ్యాప్తంగా 8545 పోస్టులు మంజూరయ్యాని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment