తెలంగాణ రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ అనారోగ్యబారిన పడిపోయిందని వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
చెన్నై: తెలంగాణ రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ అనారోగ్యబారిన పడిపోయిందని వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఉన్నతమైన వైద్యసౌకర్యాలు, సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులు హైదరాబాద్‌లో ఉండిపోగా ఏపీ శూన్యంగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రభుత్వ ఆసుపత్రుల పరిశీలన నిమిత్తం మంత్రి కామినేని మంగళవారం చెన్నైకి చేరుకున్నారు. నగరంలోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ, రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆసుపత్రులను అయన సందర్శించారు. ఆయా ఆసుపత్రుల్లో అందుతున్న వైద్యసేవలను, అత్యాధునిక యంత్రాలు, పరికరాలను పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ క్లిష్టతరమైన వైద్యానికి తెలంగాణ (హైదరాబాద్) పై ఆధారపడాల్సిన అగత్యం ఏర్పడిందని, విభజన వల్ల ఆరోగ్యశాఖ తీవ్రస్థాయిలో ఆర్థికఇబ్బందులను కూడా ఎదుర్కొంటోందని చెప్పారు. వైద్యరంగంలో సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా ఈ దుస్థితిని అధిగమించే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. విజయవాడ, తిరుపతి, విశాఖపట్టణంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటు, ప్రతి జిల్లా కేంద్రాల్లో ఆధునిక వైద్యసేవలను ప్రవేశపెట్టనున్నామని చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ వల్ల పేదలకు కార్పొరేట్‌వైద్యం దక్కినా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు నిర్లక్ష్యానికి గురైయ్యాయని విమర్శించారు.
పరిపాలనాపరంగా సీఎం చంద్రబాబు ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా రూ.23వేల కోట్లతో రైతుల రుణమాఫీ చేశారని, అలాగే రూ.10వేల కోట్లు స్వయం ఉపాధి సంఘాల రుణమాఫీకి కేటాయించారని తెలిపారు. గుజరాత్ వైద్యకళాశాలల నిర్వహణ తీరు బాగున్నట్లు గుర్తించామని, తమిళనాడు ప్రభుత్వ వైద్యసేవలు ప్రశంసనీయంగా ఉన్నాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోని మంచిని అనుసరించడంలో తమకు ఎలాంటి భేషజం లేదని పేర్కొన్నారు. తమిళనాడు వైద్యశాఖా మంత్రి సి. విజయభాస్కర్ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.