
సాక్షి, అమరావతి : ఈఎస్‌ఐలో జరిగిన రూ.300 కోట్ల మేర అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ ఆదేశించారు. టీడీపీ ప్రభుత్వంలో ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లులో భారీగా అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మంత్రుల అండదండలతో మందులను సరఫరా చేయకుండానే బిల్లులను నమోదు చేసి పెద్ద ఎత్తున అధికారులు అక్రమాలకు పాల్పడ్డారు. అవసరంలేని, గడువు ముగిసిపోయే మందులను సరఫరా చేసి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. ఆస్పత్రులకు మందులు సరఫరా చేయకుండానే కోట్ల రూపాయాల ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు సరఫరాదారులతో అధికారులు కుమ్మకమయ్యారు. ఈఎస్‌ఐ కార్యాలయం అద్దెలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి.
ఈ కుంభకోణంలో రూ.300 కోట్లకు పైగా సొమ్మును స్వాహా చేసుకున్నారని గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. దీంతో ఈఎస్‌ఐ అవినీతిపై విచారణ జరిపించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని మంత్రి జయరామ్ శనివారం అధికారులను ఆదేశించారు. ఈ విచారణ బాధ్యతను కార్మిక శాఖ డైరెక్టర్‌కు అప్పగించారు.