గ్యాస్‌ లీక్‌ : సీఎం జగన్‌ సహాయం ఓ నిదర్శనం | AP Ministers Distributes Checkes To Vishaka Gas Leakage Victims | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ లీక్‌ : సీఎం జగన్‌ సహాయం ఓ నిదర్శనం

Published Mon, May 11 2020 1:44 PM | Last Updated on Mon, May 11 2020 3:07 PM

AP Ministers Distributes Checkes To Vishaka Gas Leakage Victims - Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో మృతి చెందినవారికి సంబంధించి ఎనిమిది కుటుంబాలకు మంత్రులు కురసాల కన్నబాబు, బొత్స సత్య నారాయణ, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్‌లు చెక్కులు అందించారు. మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల చెక్కులను అందజేశారు. మొత్తం ఎనిమిది కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి కురసాల కన్నబాబు మాట్లడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన విధంగా మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం అందించామన్నారు. ఆ మొత్తాన్ని బ్యాంకులో జమచేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, సీఎం జగన్‌ వారికి రాసిన లేఖతో పాటు అందించామని తెలిపారు. ప్రస్తుతం ఎనిమిది కుటుంబాలకు చట్టపరమైన వారసులను గుర్తించామని, మిగిలిన నాలుగు కుటుంబాల వారసులు గుర్తించిన వెంటనే పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు. (విశాఖ గ్యాస్ లీక్‌‌ బాధితులకు చెక్కుల పంపిణీ)

చెక్కల పంపిణీ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ‘బాధితులను తక్షణమే ఆదుకోవాలని, వారికి అండగా నిలవాలని భావించి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటిరూపాయల పరిహారం ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఆదివారం రాత్రి విశాఖపట్నంలో మంత్రులు, అధికారులతో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సోమవారం ఉదయమే మృతుల కుటుంబాలకు సహాయం అందించాలని ఆదేశించారు. మనస్సున్న మనిషిగా ఆయన స్పందించిన తీరుకు ఈ సహాయం ఓ నిదర్శనంగా చెబుతున్నాం. ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారి గురించి సమీక్షించాం. డిశ్ఛార్జ్ చేయాల్సిన వారిని గుర్తించి వారిని సురక్షిత ప్రాంతానికి పంపిస్తాం. రేపు ఎక్కువ మందిని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుందని వైద్య అధికారులు తెలియచేశారు. ఎవరైతే పూర్తిగా కోలుకుని ఇకపై ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యాధికారులు ధృవీకరిస్తారో వారిని మాత్రమే డిశ్చార్జ్ చేస్తాం.

డిశ్చార్జ్ చేసిన అనంతరం వారికి కూడా ముఖ్యమంత్రి ప్రకటించిన పరిహారాన్ని అందిస్తాం. ఐదు గ్రామాలలో బాధితులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు సహాయం అందిస్తామని సీఎం చెప్పారు. ఆ ప్రకారం గ్రామాలలోకి ప్రజలు తిరిగి వెళ్లిన వెంటనే వాలంటీర్లను ఇంటికి పంపించి పెన్షన్ మాదిరిగా ఇస్తున్నారో అదే విధంగా ఇంటివద్దకే పంపిస్తాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తప్పకుండా సహాయం అందించడం వైఎస్‌ జగన్ మార్క్. అందుకే వారందరికీ సేవలు తక్షణం అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. సంఘటన ఏడో తేదీ జరిగితే కేవలం మూడురోజుల వ్యవధిలో బాధిత కుటుంబాలకు కోటిరూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ సంఘటన దృష్ట్యా పారిశ్రామిక భద్రతకు సంబంధించి నూతన విధానాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ భావిస్తున్నారు. ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం’ అని అన్నారు.

బాధితులకు అండగా ఉంటాం : అవంతి శ్రీనివాస్ 
‘ప్రజలు ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫ్యాక్టరీలో ఉన్న స్టైరిన్ గ్యాస్ పూర్తి అదుపులో ఉంది. దయచేసి సోషల్ మీడియా రూమర్స్ గాని, వదంతులు గాని ఎవ్వరూ కూడా నమ్మద్దు.ఐదు గ్రామాలలో రసాయనాలతో క్లీన్ చేసే కార్యక్రమం మున్సిపల్ సిబ్బంది ద్వారా జరుగుతోంది. సోమవారం రాత్రికి ప్రజలకు ఇబ్బంది లేకుండా భోజన వసతి కూడా ఏర్పాటు చేశాం. ప్రజలందరూ కూడ గ్రామాలలోకి వచ్చిన తర్వాత మెడికల్ క్యాంపులు కూడా పెట్టమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ చెప్పారు. అన్నిరకాల హెల్త్ చెకప్‌లు చేయించి వారికి పూర్తి అండగా ఉంటాం’ అని అన్నారు.

ప్రగాఢసానుభూతి : మంత్రి ధర్మాన కృష్ణదాస్
‘ఎల్జీ పాలిమర్స్ ప్రమాద సంఘటన చాలా దురదృష్టకరం. బాధితులు, చనిపోయిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాం.ప్రజల ఆరోగ్యం, సంక్షేమం పట్ల చిత్తశుద్దితో పనిచేస్తున్న ప్రభుత్వం మాది. రాష్ర్టంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అనేకమంది నిపుణులతో కమిటీలు వేసి నివేదికలు తెప్పించుకున్న తర్వాత తగిన విధంగా చర్యలు  తీసుకోవడం జరుగుతుంది. బాధిత ఐదు గ్రామాల ప్రజలకు ప్రజాప్రతినిధులు, అధికారుల అండగా ఉంటారు’ అని పేర్కొన్నారు.
 
కంపెనీపైన మాకు ప్రేమలేదు: బొత్స సత్యన్నారాయణ 
‘నిపుణుల సూచనల మేరకే ఐదు గ్రామాలలో శానిటైజ్ చేస్తున్నాం.  సాయంత్రం నాలుగు గంటల తర్వాత మేం కూడా గ్రామాలకు వెళ్లి గ్రామస్తులను ఇళ్లల్లోకి తీసుకువెళ్తాం. కంపెనీ మెయింటెనెన్స్కు జిల్లా కలెక్టర్ మూడుషిఫ్ట్ లలో 15 మంది చొప్పున 45 పాసులు జారీచేశారు. ప్రమాదం జరిగినప్పుడు 15 మంది ఉన్నారు. కంపెనీపైన మాకు ప్రేమలేదు. ఇక్కడ ఉన్న ప్రజలపైన, వారి సంక్షేమం, ఈ ప్రాంతం భద్రత పైన మాత్రమే మాకు ప్రేమ ఉంది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దాలనే ధ్యేయంగా పెట్టుకున్నాం. ఈ ప్రభుత్వం వచ్చాక ఎల్జీ పాలిమర్స్ కు ఎటువంటి నూతన అనుమతులు ఇవ్వలేదు. పాత అనుమతులతోనే పనిచేస్తోంది.’ అని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement