సాక్షి, అమరావతి: రైతులకు ధాన్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన రూ.4,724 కోట్ల బకాయిలను విడుదల చేయించడంలోను, అలాగే పోలవరం ఆర్ అండ్ ఆర్, ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇప్పించడంలోను ప్రత్యేక చొరవ చూపించడం ద్వారా రాష్ట్రానికి సహకరించాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు రాష్ట్ర మంత్రులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రులు కురసాల కన్నబాబు, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), పోలుబోయిన అనిల్‌కుమార్‌లు బుధవారం ఉప రాష్ట్రపతికి లేఖ రాశారు. రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న చర్యలను వారీ సందర్భంగా లేఖలో వివరించారు. లేఖ పూర్తిపాఠం యథాతథంగా..
గౌరవనీయులు, పెద్దలు వెంకయ్య నాయుడుగారికి..
- ధాన్యం సేకరణ, కొనుగోలుకు సంబంధించి సోమవారం(మార్చి 2న) అధికారులతో మీరు రివ్యూ చేసిన విషయం పత్రికల ద్వారా తెలుసుకున్నాం. ఈ విషయంపై కేంద్ర వ్యవసాయ, ఆహార శాఖల మంత్రులతోనూ సంభాషించారని తెలిసింది. తెలుగు రైతులు, తెలుగు ప్రజలమీద మీకున్న ప్రత్యేక అభిమానం మాకెంతో సంతోషాన్నిస్తోంది. 2017 ఆగస్టులో ఉప రాష్ట్రపతి అయిన నాటినుంచి నేటివరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల మీరు చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధకు ధన్యవాదాలు.
- ధాన్యం సేకరణ, చెల్లింపుల వ్యవహారం రాష్ట్రప్రభుత్వ పరిధిలోనిదే అయినా ఈ విషయంలో మీ చొరవ రాష్ట్రానికి మంచి చేస్తుందని భావిస్తున్నాం. ఇందుకు సంబంధించి మీ పూర్తి సహాయ సహకారాలు అర్థిస్తూ మరికొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా, కేంద్ర ప్రభుత్వ కనీస మద్దతు ధర(ఎం.ఎస్.పి) కంటే ఎక్కువగా రైతులకు చెల్లించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కొనుగోళ్లు చేస్తున్న విషయం మీ దృష్టికి వచ్చిందని భావిస్తున్నాం. ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్న రైతుభరోసాగానీ, ఎంఎస్‌పీ లేని పంటలకు కూడా శాశ్వతంగా ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోలు చేస్తున్న విధానంగానీ దేశ రైతు చరిత్రలోనే సువర్ణాధ్యాయానికి శ్రీకారం చుట్టింది.
- రైతులకు ధాన్యం విషయంలో కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు రూ.4,724 కోట్లు. రూ.8,000 కోట్ల మేర ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోళ్లు జరిగితే, ఇందులో రూ.2,000 కోట్లు తప్ప మిగతా రూ.6,000 కోట్లు చెల్లింపులను ఈ కొత్త ప్రభుత్వం చేసింది. మిగిలిన మొత్తాన్ని అప్పు తెచ్చి అయినా రైతులకు వెంటనే చెల్లించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించిన వెంటనే.. ఆ మొత్తాన్ని కూడా విడుదల చేశాం.
- ఈ సందర్భంగా మరో విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాం. గత చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం బాధ్యత లేకుండా ఎన్నికల ముందు రైతులకు ఇవ్వాల్సిన రూ.960 కోట్ల బకాయిలను ఇవ్వకుండా ఎగ్గొట్టడంతో.. రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికున్న చిత్తశుద్ధి, నిబద్ధత వల్ల పాత బకాయిలను సైతం మా ప్రభుత్వం బాధ్యతగా చెల్లించింది. అలానే గత ప్రభుత్వం రూ.40 వేల కోట్లకుపైగా కాంట్రాక్టర్లకు బకాయిలుపెట్టి.. రూ.రెండున్నర లక్షల కోట్లకుపైగా అప్పు రాష్ట్ర ప్రభుత్వంపై మోపి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసింది. అయినా ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకంగా ఉన్న తెలుగుదేశం అనుకూల మీడియా ఈ నిజాలన్నింటినీ చెప్పదు.
- రైతు పట్ల నిబద్ధత ఉన్న ప్రభుత్వంగా రైతుకు చేయగలిగిన ప్రతి మంచీ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి రావాల్సిన రూ. 4,724 కోట్ల మేర బకాయిల్ని విడుదల చేయించటంలోగానీ, పోలవరం ఆర్ అండ్ ఆర్, ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇప్పించటంలోగానీ, విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన ప్రాజెక్టులు, సంస్థల విషయంలోగానీ.. మీరు ప్రత్యేక చొరవ, శ్రద్ధ చూపించి కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన ఆర్థిక వనరులను ఇప్పించి, ఈ రాష్ట్రానికి మంచి చేయించాలని కోరుకుంటున్నాం.
మీ చొరవతో.. నిధులిప్పించండి
Published Thu, Mar 5 2020 4:43 AM | Last Updated on Thu, Mar 5 2020 4:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment