కాకినాడ సిటీ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ వెల్లడించారు. ఈ ఎన్నికకు సంబంధించి ఈ నెల 16 వరకు నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. ఎన్నికల షెడ్యూల్ అంశంపై కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జిల్లాస్థాయి ప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ సెలవు రోజులు మినహా అన్ని పని దినాల్లో 16 వరకు కలెక్టరేట్‌లో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారిగా తాను లేని పక్షంలో సహాయ రిటర్నింగ్ అధికారిగా డీఆర్‌ఓ నామినేషన్లు స్వీకరిస్తామన్నారు.
17న నామినేషన్ల పరిశీలన, 19 లోపు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. జూలై 3న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూలై 7న ఉదయం 8 గంటలకు కలెక్టరేట్ బెన్నెట్ క్లబ్‌లో నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి రాష్ట్రంలో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరై ఉండి 35 ఏళ్లకు పైబడిన వయసు ఉండాలని స్పష్టం చేశారు. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఫారం-26లో నోటరైజ్డ్ అఫిడవిట్‌ను ఇవ్వాలన్నారు. జనరల్ అభ్యర్థులైతే రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే కుల ధ్రువీకరణ పత్రంతో పాటు రూ.5 వేల ధరావత్తు చెల్లించాలన్నారు.
నియమావళి పాటించాలి
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పక పాటించాలని రాజకీయ పార్టీలకు రిటర్నింగ్ అధికారి, జేసీ సత్యనారాయణ సూచించారు. ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే లౌడ్ స్పీకర్లకు, వాహనాలకు పోలీస్ అధికారుల అనుమతి ఉండాలన్నారు. రాజకీయ పార్టీలు, పోటీచేసే అభ్యర్థులు, ప్రచురించే పోస్టర్లు, కరపత్రాల ముద్రణకు సంబంధించి నియమాలను తప్పక పాటించాలన్నారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి శెట్టిబత్తుల రాజబాబు, సీపీఎం కాకినాడ నగర కార్యదర్శి పలివెల వీరబాబు, టీడీపీ జిల్లా నాయకులు మందాల గంగసూర్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు విలియం హేరీ, బీఎస్పీ నాయకులు చొల్లంగి వేణుగోపాల్, డీఆర్వో బి.యాదగిరి, రాజమండ్రి అర్బన్ అడిషనల్ ఎస్పీ శరత్‌బాబు, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ కె.సుబ్బారావు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
Published Wed, Jun 10 2015 12:21 AM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM
Advertisement
Advertisement