కాకినాడ సిటీ :ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ శాతం ముందు ప్రకటించినట్టు కాక మారింది. పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వారీ పూర్తి సమాచారం అందక పోవడంతో ఆ జిల్లా నుంచి వచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు ముందుగా శాతాన్ని ప్రకటించారు. తరువాత వచ్చిన అధికారిక నివేదికల ఆదారంగా ఆ శాతంలో మార్పు చోటు చేసుకుంది. రెండు జిల్లాల్లో మొత్తం 83.71 శాతం, తూర్పుగోదావరిలో 82.71 శాతం, పశ్చిమగోదావరిలో 85శాతం నమోదైనట్టు ఆదివారం రాత్రి ప్రకటించారు. రెండు జిల్లాల్లో 21,551 మంది ఓటర్లు ఉండగా 18,040 మంది ఓటుహక్కును వినియోగించుకున్నట్టు తెలిపారు. అరుుతే తాజా సమాచారంతో సోమవారం అధికారులు డివిజన్‌ల వారీగా పోలైన ఓట్ల శాతాన్ని ప్రకటించారు.
నియోజకవర్గం పరిధిలోని పది డివిజన్‌ల నుంచి పోలింగ్ కేంద్రాల వారీ బ్యాల ట్ బాక్సులు కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు చేర్చే ప్రక్రియ సోమవారం తెల్లవారుజాముకు పూర్తయింది. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వారీగా ప్రిసైడింగ్ అధికారులు పోలైన ఓట్ల నివేదికను అందజేశారు. వాటి ప్రకారం రెండు జిల్లాల్లో మొత్తం 81.14 శాతం పోలింగ్ నమోదైంది. తూర్పుగోదావరిలో 82.66 శాతం, పశ్చిమగోదావరిలో 79.17 శాతంగా ఉంది. నియోజకవర్గంలోని 117 పోలింగ్ కేంద్రాల పరిధిలో 21,551 మంది ఓటర్లు ఉండగా 17,487 ఓట్లు పోలయ్యాయి.
తూర్పుగోదావరిలో..
జిల్లాలో 12,176 మంది ఓట్లకు 10,065 ఓట్లు పోలయ్యాయి. వీరిలో 8,028 మంది పురుష ఓటర్లు కాగా వారిలో 6,647 మంది ఓట్లు పోలయ్యాయి. 4,148 మంది మహిళా ఓటర్లకు 3,418 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పశ్చిమగోదావరిలో..
పశ్చిమగోదావరి జిల్లాలో 9,375 ఓట్లకు 7,422 ఓట్లు పోలయ్యాయి. వీరిలో 6,053 మంది పురుష ఓటర్లకు 4,744 ఓట్లు పోలయ్యాయి. 3,322 మంది మహిళా ఓటర్లకు 2,678 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ 81.14 శాతం
Published Tue, Mar 24 2015 5:44 AM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM
Advertisement
Advertisement