ఏపీది తొండి పంచాయితీ | AP Panchayat | Sakshi
Sakshi News home page

ఏపీది తొండి పంచాయితీ

Published Sun, Jan 4 2015 1:17 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM

ఏపీది తొండి పంచాయితీ - Sakshi

ఏపీది తొండి పంచాయితీ

  • కృష్ణా జలాల పంపకంపై హరీశ్‌రావు
  •  ‘మా జలాలు మాకే.. మీ జలాలు మాకే’ అన్నట్లు ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది
  •  పోలవరం ఎత్తు పెంపుపై కేంద్రానికి ఫిర్యాదుచేస్తాం
  • సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాలుదువ్వి గిలికజ్జాలు చేస్తోందని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. సమస్యలను మరింత జటిలం చే స్తూ తొండి పంచాయతీకి తెరతీస్తోందని దుయ్యబట్టారు. సమస్య పరిష్కారం కోసం చర్చలకు రాకుండా, తమ సూచనలను అంగీకరించకుండా కుంటి సాకులు చెబుతూ జలాల పంపిణీపై ఎటూ తేల్చడం లేద ని మండిపడ్డారు. వాటాలకు మించి వాడుకొని, ఇప్పుడు ‘మా జలాలు మాకే.. మీ జలాలు మాకే’ దక్కాలన్న ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

    ఈ వ్యవహారంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జల వనరుల శాఖకు ఫిర్యాదు చేస్తామన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘నాగార్జునసాగర్ కింద నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో రబీ నారుమళ్లు మొదలయ్యాయి. సాగర్ నుంచి నీటి విడుదలపై స్పష్టత ఇవ్వాలని జిల్లాల ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. మా అధికారులు చర్చలు జరుపుతున్నా వారు ముందుకురావడం లేదు. స్వయంగా మీరే తేల్చుకోవాలని కృష్ణా బోర్డు సూచించినా ఏపీ కుంటిసాకులతో సమావేశాన్ని వాయిదా వేస్తోంది.

    దీంతో నీటి విడుదలపై రైతులకు స్పష్టత ఇవ్వలేకపోతున్నాం’ అని పేర్కొన్నారు. కృష్ణాలో బచావత్ ట్రిబ్యునల్ జరిపిన కేటాయింపుల మేరకే నీటిని వాడుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలోని అన్ని జలాశయాలను ఖాళీ చేసి నీటిని తమకే ఇవ్వాలన్న ధోరణితో ఏపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. మానవతా దృక్పథంతో ఏపీ ఖరీఫ్ అవసరాలకు 30 టీఎంసీల నీటిని అప్పుగా ఇస్తామని, తర్వాతి సీజన్‌లో దాన్ని సర్దుబాటు చేసుకుందామని ప్రతిపాదించినా అంగీకరించడం లేదన్నారు.
     
    రాముల వారినీ ముంచేయత్నం

    పోలవరం ఎత్తును పెంచుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఇప్పటికే పోలవరం పేరుతో ఆరు మండలాలను లాగేసుకున్నారు.  భద్రాద్రి రాముడి భూములను ముంచేశారు. ఇప్పుడు ఎత్తు పెంచి గుడిని, రాముల వారిని ముంచేద్దామని ప్రణాళికలు వేస్తున్నారు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎత్తు పెంపును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని, దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు.

    ఇప్పటికే సీలేరులో విద్యుత్ వాటా ఇవ్వని ఏపీ, బూర్గంపహాడ్‌ను ఏపీలో కలపాలని కోరుతూ ఇప్పుడు కిన్నెరసానిని ఆక్రమించే ప్రయత్నాలు చేస్తోం దని, ఇది దుర్మార్గపు చర్య అని విమర్శించారు. పోలవరం ఎత్తు పెంపుపై ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో మాట్లాడి దీన్ని అడ్డుకునేందుకు కలసి పనిచేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగాన్ని ఎండబెట్టి నీళ్ల చిచ్చుపెడుతున్న  చంద్రబాబు వైఖరిని తెలంగాణ టీడీపీ నాయకులు ఎందుకు ఎండగట్టరని హరీశ్‌రావు సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ నీళ్లు బాబు తాగాలని చూస్తుంటే, టీడీపీ నాయకులు బాబు మోచేతి నీళ్లు తాగుతున్నారని ఎద్దేవాచేశారు.
     
    భూసేకరణ వేగవంతం చేయండి


    రాష్ట్రంలో చేపడుతున్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింద చేపట్టాల్సిన భూసేకరణను వేగవంతం చేయాలని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులకు సూచించారు. తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టుల కింద పెండింగ్‌లో ఉన్న భూసేకరణను సత్వరమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శనివారం నీటి పారుదల శాఖ అధికారులు, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లకు కొత్త భూసేకరణ చట్టం మార్గదర్శకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

    ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శ్రీదేవి కొత్త మార్గదర్శకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సదస్సుకు హాజరైన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. కొత్త చట్టం అమల్లోకి రాని దృష్ట్యా ఏడాదిగా ప్రాజెక్టుల కింద భూసేకరణ జరగలేదని, ఇప్పటికైనా ఈ సేకరణ పూర్తి చేయాలని సూచించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement