ఎన్నికల హామీలను గాలికొదిలేసిన పాలకపక్షంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. హామీలు మరచిన చంద్రబాబు తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి, విశాఖపట్నం)
ఎన్నికల హామీలను గాలికొదిలేసిన పాలకపక్షంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. హామీలు మరచిన చంద్రబాబు తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మెడలు వంచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ ఆరంభించిన పోరుబాటలో సాగుతామని స్పష్టం చేశారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వెన్నంటి ఉండి ఉద్యమపథంలో సాగుతామని ప్రతినబూనారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పిలుపుమేరకు శుక్రవారం వేలాదిగా రైతులు, డ్వాక్రా మహిళలు, పార్టీ శ్రేణులు, ప్రజలు కదం తొక్కుతూ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద మహాధర్నాలు నిర్వహించారు.
విశాఖ కలెక్టరేట్ వద్ద ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన మహాధర్నాకు భారీ ఎత్తున సంఘీభావం ప్రకటించారు. జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా పాల్గొంటారని ప్రకటించడంతో విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద మహాధర్నా రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు తగ్గట్లుగానే జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు విశాఖ కలెక్టరేట్‌కు తరలివచ్చారు. మండే ఎండను సైతం లెక్కచేయకుండా, ప్రభుత్వ వేధింపులను వెరవకుండా కదలివచ్చిన భారీ జనసమూహంతో ఉదయం 10గంటలకే కలెక్టరేట్ ప్రాంగణం కిటకిటలాడిపోయింది. మధ్యాహ్నం 1.30 గంటవరకు సాగిన ధర్నా ఆద్యంతం నేతల ప్రసంగాలను ఆసక్తిగా ఆలకించారు.
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, నేతలు మాట్లాడుతూ తమ అధినేత మహాధర్నా చేపట్టాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఇక వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ఆద్యంతం స్ఫూర్తిదాయకంగా సాగి ధర్నా వాతావరణాన్ని వేడెక్కించింది. జనవరి 6, 7 తేదీల్లో రెండురోజులు నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న 86 మంది రైతుల కుటుంబాలను సంక్రాంతి తరువాత వ్యక్తిగతంగా కలిసి ఓదార్చనున్నానని ప్రకటించడంతో ధర్నా స్థలి చప్పట్లు, ఈలలతో మార్మోగింది.