మాట్లాడుతున్న మంత్రి ధర్మాన కృష్ణదాస్, పక్కనే స్పీకర్ తమ్మినేని, ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ తదితరులు
సాక్షి, అరసవల్లి: చట్ట సభల్లో చేసిన శాసనాలను అమలు పరిచే బాధ్యత ఉద్యోగులందరి మీద ఉందని, ఈ విషయం లో ఉద్యోగులంతా రాష్ట్ర బంగారు భవిష్యత్ కోసం కష్టపడి పనిచేయాలని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కోరారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) తొలి మహా సభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన ఈ మహాసభలో కీలక నేతలంతా ప్రసంగించారు.
చరిత్రలో ఎంతోమంది ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని, వారిని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని స్పీకర్ సూచించారు. మహాసభలను సిక్కోలు నుంచి ప్రారంభించడం శుభసూచికమని అన్నారు. కులం తో కాకుండా కష్టంతో పైకి రావాలని అక్కడ పెట్టిన కొటేషన్లను ఉద్దేశిస్తూ అన్నారు. సమన్వయమే బలంగా పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ఐఆర్ ప్రకటించారని, అలాగే పదవీ విరమణ అయ్యేలోగా ఇళ్ల నిర్మాణాలను కూడా ఉద్యోగులు చేపట్టుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుందన్నారు. ఉద్యోగులు అడిగిన మేరకు అన్ని డిమాండ్ల పరిష్కారానికి తాను ముఖ్యమంత్రితో చర్చిస్తానని భరోసా ఇచ్చారు.
ఉద్యోగుల సంక్షేమం ముఖ్యం..
అనంతరం రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడారు. ఈ సంఘాన్ని వైఎస్ జగన్ హయాంలోనే 103వ సంఘంగా గుర్తించినట్లు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఏపీ ఎన్‌జీఓ సంఘ నేతలు స్వార్థ రాజకీయాలు చేశారని విమర్శించారు. అశోక్ బాబు వంటి వారు ఉద్యోగులను వాడుకున్నారని ఘా టుగా వ్యాఖ్యానించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
నంబర్ వన్ సంఘంగా..
శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మా ట్లాడుతూ ఉద్యోగుల మద్దతుతోనే రాష్ట్రం లో బలంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చింద ని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులకు స్నేహపూర్వకంగా నడుస్తుందన్నారు. సీఎం జగన్‌కు ఉద్యోగులంతా సహకరించాలని కోరారు. సూర్యనారాయణ లాంటి మంచి, నిజాయితీ గల వ్యక్తి ఉద్యోగులందరికీ నాయకుడిగా ఉం డడం మంచి పరిణామమని, ఈ సంఘం రాష్ట్రంలో నంబర్ వన్‌గా నిలుస్తుందనే నమ్మకం తనకుందన్నారు. హక్కులతో పాటు బాధ్యతలు కూడా తలకెత్తుకోవాలని కోరారు.
ఎన్జీవో నేత అక్రమాలకు కేరాఫ్
ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్జీవో నేత చౌదరి పురుషోత్తం నాయుడు అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిపోయాడని, ఆయన అసలు ప్రభుత్వ ఉద్యోగ విధులే ఎక్క డా నిర్వర్తించరని, సొంతంగా పేపర్ నడుపుకుంటూ, ఉద్యోగులకు బెదిరింపులు చేస్తూ అక్ర మాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఉద్యోగుల సంక్షేమం పూర్తిగా మరిచిపోయి తన స్వ లాభం కోసం దందాలు నడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. బదిలీల సమయంలో సచివాలయంలో దళారీగా పనిచేశారని ఆరోపించారు.
ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు
ఏపీజీఈఏ రాష్ట్ర సంఘ అధ్యక్షుడు కె.రామసూర్యనారాయణ మాట్లాడుతూ రాజకీయాలకు అ తీతంగా, నిజాయితీగా పనిచేస్తామని, అయితే ప్రస్తుతం ఉద్యోగుల సంక్షేమంపై సానుకూలంగా వ్యవహరిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ప్రకటించడంతో పాటు ఉద్యోగులందరికీ ఇళ్లు ఇ స్తామని సీఎం ప్రకటించారని, ఈ విషయంలో ఉద్యోగులకు ఇంటి స్థలాలు కాకుండా కేవలం ఇళ్లు మాత్రమే ఇవ్వాలని కోరారు.
స్థలాలిస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అవకాశముం టుందని, గతంలో గచ్చిబౌలిలోని 487 ఎకరాల స్థలాల వ్యవహారాన్ని గుర్తుచేశారు. జిల్లాలో ఎన్జీవో సంఘ నేతలు సంఘాన్ని అడ్డం పెట్టుకుని మాఫియా నడుపుతున్నారని, భారీగా అక్రమాలు చేశారని, ఉద్యోగులెవరైనా తమ మాట వినకపోతే, తమ సొంత మీడియాలోనే వార్తలు రాయించుకుని బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి జి.ఆస్కారరావు మాట్లాడుతూ ఇంత వరకు ఉద్యోగ సం ఘాల పేర్లతో అక్రమాలకు తెగబడ్డారని, దీన్ని నిలువరించేందుకు అలాగే స్వచ్ఛందంగా ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయడానికే ఈ సంఘం ఏర్పడిందని వివరించారు.
జిల్లాలో ఎన్జీవో సంఘ నేతల అక్రమాలు త్వరలోనే బయటపెడతామని, గత బదిలీల వ్యవహారంపై బహిరంగ విచారణకు తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. సమావేశంలో ఏపీజీఈఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఐ.రఘుబాబు, సంఘ రాష్ట్ర కార్యవర్గం పింగళి గిరిధర్, డి.శ్రీకాంత్‌రాజు, వినయ్‌మోహ జిల్లా సంఘ అధ్యక్షుడు నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ జి.సీతారాం, జిల్లా గౌరవాధ్యక్షుడు కిలారి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. మహాసభ ముగింపు సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా కార్యవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు.
వినతుల వెల్లువ
సీపీఎస్ రద్దు కోరుతూ ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘ నేతలు ఎం.సురేష్, ప్రధాన కార్యదర్శి రెడ్డి సూరిబాబు, తదితరులు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు వినతిపత్రం సమర్పించారు. అలాగే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కె.రామసూర్యనారాయణకు స్థానిక ఆర్‌డబ్ల్యూఎస్ విబాగంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ల్యాబ్ అసిస్టెంట్లు సంఘాల ప్రతినిధులు పి.సురేష్, కె.సత్యన్నారాయణ, లోకేశ్వరరావులు వినతిపత్రం సమర్పించి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment