సాక్షి, విజయవాడ: కరోనా వైద్య పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ రికార్డ్ సృష్టిస్తోంది. అత్యధికస్థాయిలో టెస్టులు చేస్తూ వరుసగా మూడోరోజూ మొదటి స్థానంలో నిలిచింది. పది లక్షల మందికి సగటున 1018 పరీక్షలు నిర్వహిస్తూ దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో రాజస్థాన్ నిలిచాయి. ఇప్పటివరకు 54,341 మందికి పరీక్షలు నిర్వహించామని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇందులో 955 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణవగా, 145 మందిని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. గడిచిన 24 గంటల్లో 6306 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపింది. సామాజిక నిఘా (కమ్యూనిటీ సర్వైలెన్స్) కోసం గురువారం నుంచి ర్యాపిడ్ కిట్లతోనూ పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొంది. వీఆర్డీఎల్ ల్యాబ్‌లు, ట్రూనాట్ సెంటర్ల ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించామంది. మండల స్థాయిలోనూ వైద్య పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ ప్రత్యేకతను చాటుకుంటోంది.
వెయ్యికి చేరువలో కేసులు
గడిచిన 24 గంటల్లో ఏపీలో 62 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క కర్నూలులోనే అధిక స్థాయిలో 27 కేసులు నమోదవగా కృష్ణా 14, గుంటూరు 11, అనంతపురం 4, తూర్పు గోదావరి 2, నెల్లూరులో 1 కరోనా కేసులు వెలుగు చూశాయి. దీంతో ఆంధ్రపద్రేశ్‌లో కరోనా బాధితుల సంఖ్య 955కు చేరుకుంది. ఇందులో 781 యాక్టివ్ కరోనా కేసులుండగా, 145 మందిని డిశ్చార్జ్ చేశారు. కాగా ఇప్పటివరకు 261 కేసులతో కర్నూలు తొలిస్థానంలో ఉండగా 206 కేసులతో గుంటూరు రెండో స్థానంలో ఉంది. కృష్ణా 102, చిత్తూరు 73, నెల్లూరు 68, ప్రకాశం 53, కడప 51, అనంతపురం 46, పశ్చిమ గోదావరి 39, తూర్పు గోదావరి 34, విశాఖపట్నం 22 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదవకపోవడంతో కరోనా ఫ్రీ జిల్లాలుగా కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment