-ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ వెల్లడి
విజయవాడ సిటీ: అనంతపురం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఎనర్జీ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. ఉన్నత విద్యా శాఖ అనుమతి ఇచ్చిందని చెబుతూ 2017-18 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. సోమవారం విజయవాడలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో 2015-16 వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. అక్కడ ఏర్పాటు చేయనున్న ఎనర్జీ యూనివర్సిటీకి ప్రభుత్వం భూమి కేటాయిస్తుందన్నారు. దీనిని నిర్వహణ అంతర్జాతీయంగా పేరొందిన సంస్థలు చేపడతాయన్నారు. ఇటీవల కాలంలో వర్షపు నీటితో కూడా విద్యుత్ తయారీకి అవకాశం ఉందని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎనర్జీ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా విద్యుత్ ఉత్పాదనలో కొత్త పద్ధతులపై పరిశోధనలు నిర్వహించనున్నట్టు చెప్పారు. విద్యుత్ సరఫరా, వినియోగం, అవాంతరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నట్టు చెప్పారు. తద్వారా విద్యుత్ పంపిణీలో పారదర్శకత పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. జూన్ 8న ముఖ్యమంత్రి చంద్రబాబు యాప్‌ను ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో సౌర విద్యుత్ పంపుసెట్ల పథకాన్ని సమర్థంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని 15లక్షల వ్యవసాయ పంపుసెట్లకు గాను ఈ ఆర్థిక సంవత్సరంలో 8.50లక్షల పంపుసెట్లను సౌర విద్యుత్ పథకంలోకి తీసుకొచ్చామని, 2018 డిసెంబర్ నాటికి మిగిలిన వాటిని కూడా ఈ పథకంలోకి తీసుకొస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 33 శాతం సబ్సిడీ ఇస్తుండగా తక్కువ రేటుకే నాణ్యమైన విద్యుత్‌ను రైతులకు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందుకు రైతులపై భారం పడకుండా తక్కువ రేటుకు సోలార్ పంపు సెట్లను పంపిణీ చేసి సులభ వాయిదాల్లో వసూలుకు చర్యలు చేపడుతున్నామన్నారు. రాయలసీమలో ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని న్యూ సోలార్ విండ్ పాలసీని అమలుచేస్తున్నట్టు తెలిపారు. దేశంలో 15 సోలార్ పార్కులకు కేంద్రం అనుమతించగా ఇందులో రాష్ట్రానికి నాలుగు మంజూరు చేయడం హర్షణీయమన్నారు. అనంతపురం జిల్లాలో రెండు, కర్నూలు, కడప జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున వీటిని ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. స్మార్ట్ మీటర్ల పథకాన్ని కూడా అమలులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ఉచిత ఇంటర్‌నెట్ సౌకర్యం కలిగించేందుకు ముందుకు వచ్చినందున నెట్ ద్వారా మీటర్ రీడింగ్, బిల్లింగ్ అంశాలు వినియోగదారులు తెలుసుకునేందుకు ఈ విధానం ఉపకరిస్తుందని చెప్పారు.
విభజన ఇబ్బందులను అధిగమించి 51 శాతం విద్యుత్ సరఫరా చేసే స్థాయికి వచ్చినట్టు అజయ్‌జైన్ తెలిపారు. పీక్ డిమాండ్ విషయంలో తమిళనాడు, కర్నాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పారు. దీన్ని మరింత అధిగమించి తమిళనాడు తర్వాత స్థానంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 5.50లక్షల గృహాలకు విద్యుత్ సౌకర్యమే లేదని గుర్తించి ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి 2.50లక్షల గృహాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామన్నారు. మిగిలిన వాటిని కూడా త్వరలోనే పూర్తిచేస్తామని చెప్పారు. విద్యుత్ నష్టాల విషయానికి వస్తే విభజన నాటికి 14శాతం ఉండగా, ఆ తర్వాత ఏడాది 11.4శాతానికి తగ్గించామన్నారు. ఈ ఏడాది దానిని 10.2 శాతానికి తగ్గించామని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సింగిల్ డిజిట్‌కు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దేశంలోనే ప్రభుత్వ, ప్రైవేటు డిస్కమ్‌లలో ఈపీడీసీఎల్ తక్కువ నష్టాలు కలిగి ఉండగా, ఎస్పీడీసీఎల్ నాలుగో స్థానంలో ఉందని చెప్పారు. విద్యుత్ సరఫరా మెరుగుపరుస్తూ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ లక్ష్యంగా నష్టాలను తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్టు అజయ్ జైన్ వివరించారు. విలేకరుల సమావేశంలో స్టేట్ ఎనర్జీ కన్సర్వేషన్ మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖర రెడ్డి, విజయవాడ డివిజిన్ చీఫ్ ఇంజినీర్ రాజబాపయ్య, ఎస్‌ఈ విజయకుమార్ పాల్గొన్నారు.
అనంతపురంలో ఎనర్జీ యూనివర్సిటీ
Published Mon, Apr 25 2016 6:44 PM | Last Updated on Mon, Oct 22 2018 8:31 PM
Advertisement
Advertisement