
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు అవార్డులు వరించాయి. 2019 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం అవార్డులను ప్రకటించింది. ఇందులో ఏపీకి రెండు అవార్డులు దక్కాయి. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఏపీ బెస్ట్ స్టేట్ అవార్డును కైవసం చేసుకుంది. ఇక ఈ ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు, అల్లర్లు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించినందుకు గానూ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ బెస్ట్ సీఈవో అవార్డు సొంతం చేసుకున్నారు. శనివారం ఢిల్లీలో అవార్డుల ప్రదాన కార్యక్రమం జరగనుంది. ఈ అవార్డులను స్వీకరించడానికిగానూ గోపాలకృష్ణ ద్వివేది గురువారం సాయంత్రం ఢిల్లీకి బయలు దేరారు.
ద్వివేదీకి నాగిరెడ్డి అభినందనలు
ప్రస్తుతం పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా పనిచేస్తున్న గోపాలకృష్ణ ద్వివేదీని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి అభినందించారు. చంద్రబాబు బెదిరింపులకు భయపడకుండా నిజాయితీగా పనిచేసిన వ్యక్తి ద్వివేది అని నాగిరెడ్డి అన్నారు. ద్వివేదీపై అనవసర ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకొంటాడని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవహారశైలిలో ఏమాత్రం మార్పురాలేదని, శాసనమండలి చైర్మన్‌పై కూడా వత్తిడి తెచ్చి అభివృద్ధి బిల్లుకు ఆటంకం సృష్టించారని మండిపడ్డారు. ఒత్తిడులకు తలొగ్గకుండా నిజాయితీగా పనిచేసే అధికారులకు ఎప్పుడైనా గుర్తింపు ఉంటుందనడానికి ద్వివేదీ ఒక నిదర్శనమన్నారు.