అపెక్స్ కౌన్సిల్‌పైనే ఆశలు!
- మూడోవారంలో భేటీ
- కృష్ణా జలాల వివాదం పరిష్కారందిశగా ప్రయత్నాలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదానికి ఈనెల మూడో వారంలో తెరపడవచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ‘మిషన్ కాకతీయ’ ప్రారంభోత్సవానికి మూడో వారంలో హైదరాబాద్ రానున్న కేంద్ర జలవనరులశాఖ మంత్రి, అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ ఉమా భారతి ఇరు రాష్ట్రాల సీఎంలతో ఉమ్మడిగా సమావేశం నిర్వహించి వివాదానికి పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నాయి.
ఇప్పటికే వివాదంపై కృష్ణా నదీ బోర్డు చేతులెత్తేసిన పరిస్థితుల్లో అపెక్స్ కౌన్సిల్ ఒక్కటే రాష్ట్రాల మధ్య సయోధ్య కుదర్చగలదని పేర్కొంటున్నాయి. కృష్ణా జలాలపై సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కరించుకోవడానికి రెండు రాష్ట్రాల సీఎంలు ముందుకు వస్తే తప్ప కృష్ణా జలాల వివాదానికి తెరపడదనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని ఇరు రాష్ట్రాల అధికారులు కేంద్ర జలవనరులశాఖ అధికారులకు చెప్పినట్లు సమాచారం.
కేంద్ర జలవనరుల మంత్రి నేతృత్వంలోని ‘అపెక్స్ కౌన్సిల్’లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. కేంద్ర మంత్రి ఉమా భారతి తెలంగాణకు వచ్చినప్పుడు అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తే ఆమె సమక్షంలో ఇద్దరు సీఎంలు చర్చించుకోవడానికి అవకాశం ఉంటుందని అధికారులు కేంద్రానికి నివేదించారని తెలిసింది. ఇందుకు కేంద్ర జలవనరులశాఖ అధికారుల నుంచి సానుకూల స్పందన వచ్చిందని, అపెక్స్ కౌన్సిల్ భేటీ దిశగా ప్రయత్నాలు చేస్తామని వారు పేర్కొన్నట్లు సమాచారం.
మిషన్ కాకతీయ ప్రారంభోత్సవ తేదీకి ముందు లేదా తర్వాత రోజు అపెక్స్ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ‘ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో వెళితేనే సమస్యకు పరిష్కారం ఉంటుంది. బోర్డుకు ఎన్ని లేఖలు రాసినా, బోర్డు ఎన్ని వివరాలు కోరినా.. అది సమస్యను పరిష్కరించలేదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం వచ్చిన 60 రోజుల్లోగా నోటిఫై చేయాలనే నిబంధన ఉన్నా కేంద్రం పట్టించుకోలేదు. పంతాలకు పోతే రైతులు నష్టపోతారు. వాస్తవ పరిస్థితిని దృష్టి లో పెట్టుకొని సీఎంలు సమస్య పరిష్కరించుకోవాలి’ అని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.
న్యాయ సలహా కోరే యోచనలో బోర్డు!
ఇక కృష్ణా జలాల వివాదంపై బోర్డు న్యాయ సలహా తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. సాగర్‌లో నీటి లభ్యత, డిమాండ్, భవిష్యత్ తాగునీటి అవసరాల గణాంకాలను పేర్కొంటూ రెండు రాష్ట్రాలు బోర్డుకు రాసిన లేఖల్లో పొంతన లేని లెక్కలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు సమావేశమై ఒకే రకమైన గణాంకాలు సమర్పించాలని బోర్డు సూచించినా అది సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో చేతులెత్తేసిన కృష్ణా బోర్డు తదుపరి కార్యాచరణపై న్యాయ సలహా తీసుకోవాలని యోచిస్తున్నట్లు బోర్డు వర్గాల ద్వారా తెలిసింది.