ఏపీఎండీసీ ‘టెండర్’పై స్టే | APMDC tender high court given stay order | Sakshi
Sakshi News home page

ఏపీఎండీసీ ‘టెండర్’పై స్టే

Published Fri, Jan 10 2014 2:03 AM | Last Updated on Fri, Aug 31 2018 8:53 PM

APMDC tender high court given stay order

 ఓబులవారిపల్లె, న్యూస్‌లైన్: బడాబాబులకు లబ్ధి చేకూరేలా ఏపీఎండీసీ పిలిచిన సీఅండ్‌డీ ఆన్‌లైన్ టెండర్‌పై గురువారం హైకోర్టు స్టే ఇచ్చింది. సీఅండ్‌డీ గ్రేడ్ రాయిపై ప్రస్తుతం ఉన్న ధర రూ. 1,920లు కాగా కొత్త టెండర్ రూ.1,126లకే పిలిచారు.
 
 ఈఎండీ రూపంలో పెద్ద ఎత్తున చెల్లించాల్సి రావడంపై మిల్లర్లు భగ్గుమన్నారు. ఈవ్యవహారంపై సాక్షి సమగ్రంగా కథనాలను ప్రచురించింది. కనీసం రూ.23కోట్లు ఉంటేనే టెండర్‌లో పాల్గొనే పరిస్థితులను కల్పించారు. దీంతో 150 మిల్లులు మూతపడే అవకాశం ఏర్పడింది. ఈమొత్తం వ్యవహారంపై ప్రముఖ పారిశ్రామికవేత్త గుత్తిరెడ్డి హరినాథ్‌రెడ్డి హైకోర్టులో రిట్‌పిటీషన్ నెంబర్ 39463-2013 దాఖలు చేశారు. ఆమేరకు గురువారం హైకోర్టు స్టే ఆర్డర్ నెంబర్ ఎంపీ48995-2013పై తీర్పునిచ్చారు. ఈవిషయంపై మరో పారిశ్రామికవేత్త రమణారెడ్డి కూడా హైకోర్టులో రిట్‌పిటిషన్ దాఖలు చేశారు.
 
 రెండు పిటీషన్‌లను విచారించిన హైకోర్టు స్టే మంజూరు చేసింది. గుత్తిరెడ్డి హరినాథ్‌రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం రూ.1,926 ధరతో బైరటీస్‌ను కొనుగోలు చేసి నిల్వ చేశామన్నారు. ప్రస్తుత టెండర్‌లో రాయి రేటును రూ. 1,126లకే నిర్ణయించడంతో ప్రతి మిల్లుకు సుమారు రూ. 2కోట్ల వరకు నష్టపోనున్నట్లు తెలిపారు. పాలకపక్షం కనుసన్నల్లో ఏపీఎండీసీ టెండర్లు నిర్వహించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. మంగంపేట బైరటీస్ గనులనే నమ్ముకుని 150 మిల్లుల యజమానులు మనుగడ సాగిస్తున్నారు.
 టెండర్లలో  వారు పాల్గొనే అవకాశం లేకుండా ఒక్కొక్క బిడ్ 2లక్షల మెట్రిక్ టన్నులకు నిర్ణయించడం వెనుక  బడా మిల్లర్లుకు అనుకూలంగా వ్యవహరించడమేనని పలువురు పేర్కొంటున్నారు. అయితే హైకోర్టు ఇచ్చిన స్టేతో మిల్లుల యజమానులు ఊపిరిపీల్చుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement