అంగన్‘వేడి’తో కూనల కష్టాలు
- మండుటెండల్లోనూ అంగన్వాడీ కేంద్రాలు
- విలవిల్లాడుతున్న చిన్నారులు
- గర్భిణులు, బాలింతలదీ అదే పరిస్థితి
- పాఠశాలలకు మాత్రమే సెలవులు
- వడదెబ్బ తీవ్రత పట్టని అధికారులు
ఎండలు మండిపోతున్నాయి. కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. వడదెబ్బ మరణాలు పెరిగిపోతున్నాయి. పాఠశాలలు మూతపడుతున్నాయి. సెలవులతో తరగతులు నిలిచిపోతున్నాయి. అంగన్వాడీ కేంద్రాలు మాత్రం పనిచేస్తున్నాయి. చిన్నారిపొన్నారి పిల్లల్ని నరక యాతనకు గురిచేస్తున్నాయి. గర్భిణులు, బాలింతల్ని అవస్థలపాల్జేస్తున్నాయి. పౌష్టికాహారం పంపిణీ పేరిట పసిపిల్లల్ని మండుటెండల్లో అంగన్వాడీ కేంద్రాలకు రప్పించడం ఎంతవరకూ సబబో అధికారులకే తెలియాలి.
నర్సీపట్నం : జిల్లాలో మహిళా, శిశు సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో 25 ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు. వీటిలో 3,587 అంగన్వాడీ, 1364 మినీ అంగన్వాడీ కేంద్రాలను కొనసాగిస్తున్నారు. ఈ కేంద్రాల్లో 1,95,500 మంది చిన్నారులు, 60,345 మంది గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నాయి.
జిల్లాలోని 15 ప్రాజెక్టుల్లో అమృత హస్తం పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ కేంద్రాల్లోని చిన్నారులను ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్రాల్లోనే ఉంచి పౌష్టికాహారం అందిస్తుంటారు. గర్భిణులు, బాలింతలు ఉదయం పది గంటలకు కేంద్రానికి వచ్చి గుడ్డు, 200 మిల్లీలీటర్ల పాలు తీసుకుంటారు. రెండోసారి మధ్యాహ్నం 12 గంటలకు వచ్చినప్పుడు వీరికి 200 గ్రాముల అన్నం, కూరలను వడ్డిస్తారు.
అరకొర వసతులతో చిన్నారుల అవస్థలు ఇరవై రోజులుగా జిల్లాలో ఎండలు తీవ్రరూపం దాల్చాయి. దీంతో ఎక్కువ మంది వడదెబ్బకు గురై మరణాలు సంభవి స్తున్నాయి. దీన్ని గమనించిన ప్రభుత్వం పది రోజుల క్రితమే పాఠశాలలు తెరిచినా ఎండలు తీవ్రంగా ఉండటంతో సెలవు ల్ని ప్రకటిస్తోంది. ఎండ తీవ్రత అత్యంత ప్రమాదకరమని తెలిసినా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను కొనసాగిస్తోంది.
ఈ కేంద్రాలకు చిన్నారులు ఉదయమే వచ్చి సాయంత్రం వరకు ఉండిపోవాలి. మధ్యాహ్నం భోజనం అనంతరం వారిని కేంద్రంలోనే నిద్రపుచ్చాలి. అరకొర వసతులున్న అంగన్వాడీ కేంద్రాల్లో మండుటెండల్లో పిల్లలు నిద్రపోవడం సాధ్యమేనా? అనే విషయాన్ని అధికారులు పట్టించుకోలేదు. గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం కోసం రెండుసార్లు కేంద్రానికి రావాలి.
మిట్ట మధ్యాహ్నం ఎండలో 200 నుంచి 400 మీటర్ల దూరంలోని కేంద్రానికి వచ్చి పౌష్టికాహారం తీసుకెళ్లాలి. ఇలా ఒక్కొక్కరు రోజుకు ఎండలో సుమారు కిలోమీటరు మేర నడవాలి. పాత బియ్యం ఇవ్వాల్సిన బాలింతలకు కోటా బియ్యంతో ఆహారాన్ని అందిస్తున్నారు. ఇది తింటున్న బాలింతలు రోగాల బారిన పడుతున్నారు. దీనిపై పీడీ రాబర్ట్‌ను వివరణ కోరగా దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. అక్కడినుంచి అదేశాలు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.