ప్రజావాణిలో రచ్చబండ దరఖాస్తుల నమోదు
Published Thu, Nov 28 2013 2:55 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రచ్చబండ కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను ప్రజావాణిలో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రేషన్‌కార్డులు, పింఛన్లు, దరఖాస్తుల జాబితాలను వేర్వేరుగా తయారు చేయాలన్నారు. ప్రజావాణిలో దరఖాస్తులను కేటగిరీల వారీగా ఆప్‌లోడ్ చేయాలని సూచించారు. బంగారుతల్లి పథకం కింద మే నుంచి పుట్టిన ఆడపిల్లల జాబితాను నమోదు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
3వ విడత ‘రచ్చబండ’ దరఖాస్తుల వివరాలు
రేషన్‌కార్డులకు 79,867, పింఛన్లకు 38,826, గృహాల కోసం 72,662 దరఖాస్తులు అందాయి. కాగా గత రచ్చబండ కార్యక్రమాల ద్వారా మంజూరైన వివరాలిలా ఉన్నాయి. 20,267 కొత్త రేషన్‌కార్డులు, 35,473 కూపన్లు, 20,321 పంఛన్ మంజూరు పత్రాలు, 29,437 గృహ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ గుర్తించిన 3,576, 2,508 ఎస్సీ కుటుంబాలకు రూ. 8.14 లక్షలు, గిరిజన సంక్షేమశాఖ గుర్తించిన 2,955 గిరిజన కుటుంబాలలో 2,872 కుటుంబాలకు రూ. 10.79 లక్షలను విద్యుత్తు బిల్లు బకాయిలను చెల్లించినట్టు కలెక్టర్ పేర్కొన్నారు.
యువతను ఓటర్లుగా నమోదు చేయాలి
18 ఏళ్లు నిండిన యువతను శతశాతం ఓటర్లుగా నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కళాశాల విద్యార్థులు ఓటరు నమోదుకు అధ్యాపకులు కృషి చేయాలన్నారు. బూత్ లెవెల్ కేంద్రాలతో పాటు, వెబ్‌సైట్ ద్వారా కూడా ఓటరుగా నమోదు కావచ్చని చెప్పారు. డిసెంబర్ 10వ తేదీ వరకు గడువు ఉందన్నారు. జనవరి 25న ఓటరు దినోత్సవంలో భాగంగా గుర్తింపు కార్డులు అందజేస్తామన్నారు.
Advertisement