కదిలిన ఆర్టీసీ చక్రాలు | apsrtc buses came on roads | Sakshi
Sakshi News home page

కదిలిన ఆర్టీసీ చక్రాలు

Published Sun, Oct 13 2013 3:00 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM

apsrtc buses came on roads

 ఒంగోలు, న్యూస్‌లైన్ :
 సర్కార్‌తో చర్చలు ఫలించి సీమాంధ్రలోని ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించడంతో జిల్లాలో 82 శాతం బస్సులు శనివారం రోడ్లపైకి వచ్చాయి. 110 బస్సులు మాత్రం ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేకపోవడంతో నిలిచిపోయాయి. వాటిలో ఎక్కువగా హైదరాబాద్ సర్వీసులుండటంతో కొంత ఇబ్బంది నెలకొంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్రలోని ఆర్టీసీ కార్మికులు 60 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, సర్కార్‌తో శుక్రవారం జరిపిన చర్చలు ఫలించడంతో ఎట్టకేలకు ఆర్టీసీ చక్రాలు కదిలాయి. దీంతో రెండు నెలలుగా ఆర్టీసీ బస్సులులేక అవస్థపడుతున్న ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. దసరాకి రెండురోజులు ముందుగా బస్సులు రోడ్లపైకి రావడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు కూడా దసరా రద్దీని క్యాష్ చేసుకునేపనిలో నిమగ్నమయ్యారు.
 
 కళకళలాడిన బస్టాండ్లు...
 శనివారం నుంచి ఆర్టీసీ బస్సులు తిరుగుతుండటంతో జిల్లాలోని బస్టాండ్లన్నీ ప్రయాణికులతో కళకళలాడుతూ కనిపించాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా రెండు నెలలుగా బస్టాండ్లన్నీ ఖాళీగా వెలవెలబోయాయి. బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ సంస్థతో పాటు బస్టాండ్లలో దుకాణాలు నిర్వహించే వ్యాపారులు కూడా తీవ్రంగా నష్టపోయారు. అద్దెలు ఎలా చెల్లించాలో అర్థంగాక అవస్థపడ్డారు. ప్రస్తుతం బస్సులు బయటకు తీయడంతో బస్టాండ్లలో ప్రయాణికుల సందడి నెలకొంది. వాటి ఆవరణలోని వ్యాపారులు కూడా ఆనందంగా కనిపించారు.
 
 నష్టం 61 కోట్ల పైమాటే...
 రెండు నెలలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెచేసి బస్సులు తిరగకపోవడంతో జిల్లాలో ఆ సంస్థకు 61 కోట్ల రూపాయలకుపైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. సమ్మె కారణంగా జిల్లాలోని 8 ఆర్టీసీ డిపోల్లో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీనివల్ల ఆర్టీసీకి రోజుకు కోటి రూపాయల నష్టం వాటిల్లింది. దాంతో పాటు బస్సుల నిర్వహణ, కండీషన్ పరిశీలన కోసం కొంతమంది తాత్కాలిక సిబ్బందిని నియమించారు. ఏటా శ్రావణమాసం, వినాయకచవితి పండుగల సమయంలో అరకోటి రూపాయల అదనపు ఆదాయం వచ్చేది. ఈ ఏడాది ఆ రెండు సీజన్లలో బస్సులు తిరగకపోవడం వల్ల ఆదాయం కోల్పోయింది. ఇలా ప్రత్యక్షంగా మరో 5 కోట్ల రూపాయల నష్టం ఆర్టీసీకి వాటిల్లినట్లు అంచనా.
 
 ప్రత్యేక సర్వీసులపై తలపట్టుకున్న అధికారులు...
 దసరా సందర్భంగా ప్రత్యేక సర్వీసుల ఏర్పాటుపై ఆర్టీసీ అధికారులు తలపట్టుకు కూర్చున్నారు. ఈ సమయంలో జిల్లా నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేకపోవడం వల్ల నిలిచిపోయిన 110 బస్సుల్లో అత్యధికంగా హైదరాబాద్‌కు నడిపేవే ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా బస్సును నడపకూడదు. అయితే, రెండు నెలలుగా ఆర్టీసీతో పాటు రవాణాశాఖాధికారులు, సిబ్బంది కూడా సమ్మెలో ఉండటంతో 110 బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేకుండా పోయాయి. వాటికి సర్టిఫికెట్లు తీసుకునేలోపు దసరా రద్దీ ముగుస్తుంది. ఇప్పటికే జిల్లా నుంచి 50 సర్వీసులను హైదరాబాద్ పంపారు. కానీ, సాధారణంగానే రోజూ 70 సర్వీసులు హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటాయి.
 
 దసరా రద్దీ కారణంగా మరికొన్ని అదనపు సర్వీసులు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేకపోవడంవల్ల సాధ్యపడేలా లేదు. కానీ, ప్రయాణికుల రద్దీ మాత్రం విపరీతంగా ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు యుద్ధప్రాతిపదికన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం వీ నాగశివుడు తెలిపారు. ఆదివారం సాయంత్రానికల్లా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వీలైనన్ని అదనపు సర్వీసులు నడపనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement