సాక్షి, విశాఖపట్నం: సకల జనుల సమ్మె ప్రభావం ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపింది. మంగళవారం తొలి షెడ్యూల్ నుంచే బస్సులు కదల్లేదు. నాలుగు సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు కదం తొక్కారు. కిందిస్థాయి ఉద్యోగులూ విధులు బహిష్కరించారు. ఫలితంగా విశాఖ రీజియన్ పరిధిలో సుమారు 1060 బస్సులు తొమ్మిది డిపోలకు పరిమితమైపోయాయి. ఇందులో 240అద్దె బస్సులూ ఉన్నాయి. కొన్నిచోట్ల ప్రైవేట్ బస్సుల హడావుడి కనిపించినా నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
సమ్మె కారణంగా విశాఖ రీజియన్‌లో సుమారు రూ.70లక్షల నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు, అద్దె బస్సుల ద్వారా వాహనాల్ని నడిపేందుకు అధికారులు ప్రయత్నించినా ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులు అడ్డు చెప్పడంతో రోడ్లుపై బస్సులు కనిపించలేదు. బుధవారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని, ఎన్‌జీవో సంఘం సభ్యులు సమ్మె ప్రతిపాదన విరమించేవరకూ ఆర్టీసీకీ సమ్మె ప్రభావం తప్పదని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి, సీమాంధ్ర సమితి కన్వీనర్ పలిశెట్టి దామోదర్‌రావు తెలిపారు. మద్దిలపాలెం, కూర్మన్నపాలెం ప్రాంతాల్లో సంఘం నాయకులు అల్లు సురేష్‌నాయుడు, కేజే శుభాకర్, రామకృష్ణ, ఆర్‌జీ నాయుడు, ఎం. త్రిమూర్తులు తదితరులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నినదించారు. మరోవైపు ఆర్టీసీ కాంప్లెక్సులో ఉద్యోగులు క్రికెట్ ఆడి తమ నిరసన వ్యక్తం చేశారు. మొత్తానికి బంద్ కారణంగా ఆర్టీసీ చక్రాలకు బ్రేకులు పడ్డాయి.
ఆర్టీసీ చక్రాలకు బ్రేక్
Published Wed, Aug 14 2013 4:28 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM
Advertisement
Advertisement