ప్రైవేటు జేబులోకి ఎర్రబస్సు ఆదాయం | RTC bus income into the hands of private | Sakshi
Sakshi News home page

ప్రైవేటు జేబులోకి ఎర్రబస్సు ఆదాయం

Published Sun, May 7 2017 2:31 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM

ప్రైవేటు జేబులోకి ఎర్రబస్సు ఆదాయం - Sakshi

ప్రైవేటు జేబులోకి ఎర్రబస్సు ఆదాయం

ఆర్టీసీకి రోజూ రూ.8 కోట్ల నష్టం
- నిబంధనలకు విరుద్ధంగా 2,174 ప్రైవేటు బస్సులు
- కాంట్రాక్టు క్యారియర్‌ పర్మిట్లు.. స్టేజి క్యారియర్లుగా టూర్లు
- దర్జాగా ఆన్‌లైన్‌లో టికెట్ల బుకింగ్‌
- బస్టాండ్ల సమీపంలోనే ప్రైవేటు ట్రావెల్స్‌ దందా
- అక్రమంగా 93 వేల ఆటోలు, ప్రైవేటు వాహనాలు
- రూ. 4 వేల కోట్లకు చేరుకున్న ఆర్టీసీ నష్టాలు
- యాజమాన్యం సర్వేలో బైటపడ్డ లెక్కలు
- సంస్థ పరిరక్షణ కోసం సంఘాల ఆందోళనబాట


సాక్షి,అమరావతి బ్యూరో: రోజుకు రూ.8 కోట్లు  నెలకు రూ. 240 కోట్లు ఏడాదికి రూ. 2,880 కోట్లు అక్రమ రవాణా వాహనాల వల్ల ఆర్టీసీకి కలుగుతున్న నష్టం లెక్కలివి. అక్రమంగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు ఆర్టీసీ ఆదాయానికి ఏ మేరకు గండి కొడుతున్నాయో ఈ గణాంకాలే చెబుతాయి. రెండేళ్లపాటు ఈ అక్రమాలను అరికడితే చాలు ప్రజారవాణా వ్యవస్థ అప్పుల ఊబి నుంచి బైటపడి లాభాల బాట పడుతుంది. కానీ ప్రభుత్వ పాలకులకు ఎంతో చిత్తశుద్ధి ఉంటే తప్ప అది సాధ్యం కాదు. రాష్ట్రంలో అక్రమ వాహనాల వల్ల ఆర్టీసీకి జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. ఈ నష్టం పరిమాణం ఎంత అనే దానిపై ఇటీవల ఆర్టీసీ యాజమాన్యం ఓ సర్వే జరిపించింది. ఆ సర్వేలో నిర్ఘాంతపోయే నిజాలు బైటపడ్డాయి. అక్రమంగా నడుస్తున్న వాహనాల సంఖ్యతో పాటు వాటివల్ల ఆర్టీసీకి రోజుకు ఎంత మేర నష్టం వాటిల్లుతోందో లెక్కలన్నీ తేలిపోయాయి. ఆ వివరాలు..

ప్రైవేటు వాహనాలతో ఆర్టీసీకి భారీ నష్టం..
ఆర్టీసీ సంస్థకు నష్టం తెస్తున్న ప్రైవేటు వాహనాల అక్రమరవాణాపై యాజమాన్యం చేయించిన సర్వే ప్రకారం... రాష్ట్రంలో 2,174 ప్రైవేటు బస్సులు, 93 వేల ఆటోలు అక్రమంగా నడుస్తున్నాయని తేలింది. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులు, ఆటోల వల్ల ఆర్టీసీ ఆదాయానికి గండిపడి,  నష్టాలు మిగులుతున్నాయి. రాజకీయ నేతల స్వార్థం, అధికారుల నిర్లక్ష్యంతో ప్రైవేటు అక్రమ రవాణా మాఫియా రెచ్చిపోతోంది. ప్రైవేటు బస్సులకు కాంట్రాక్టు క్యారియర్లుగా పర్మిట్లు తీసుకొని స్టేజి క్యారియర్లుగా నడుపుతూ, వాటికి ఆన్‌లైన్‌లో దర్జాగా టికెట్లు బుక్‌ చేస్తున్నారని వెల్లడైంది.

ఆర్టీసీ బస్టాండ్‌ రెండు కిలో మీటర్ల దూరంలో మాత్రమే ప్రైవేటు వాహనాలను ఆపాలని మోటారు వాహనాల చట్టంలో నిబంధన ఉన్నా ఆర్టీసీ బస్టాండ్‌ పక్కనే ట్రావెల్స్‌ ఏజెన్సీలు ఏర్పాటు చేసుకొని ఆర్టీసీకి రోజుకు రూ.4 కోట్లు ఆదాయానికి గండికొడుతున్నాయి. స్లీపర్‌ బస్సులకు ఆంధ్రాలో పర్మిట్లు బ్యాన్‌ చేశారు. గోవా, హిమాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, ఉత్తరప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో పర్మిట్లు పొంది మన రాష్ట్రంలో తిప్పుతున్నట్లు సర్వే బృందం గుర్తించింది. ప్రైవేటు బస్సుల వల్ల రూ. 4 కోట్లు నష్టం వాటిల్లుతుండగా ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల వల్ల రోజుకు మరో రూ. 4 కోట్లు నష్టం జరుగుతున్నట్లు సర్వేలో తేలింది.

ఆర్టీసీ అప్పులు, నష్టాలు రూ.4 వేల కోట్లు
ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ ఒకప్పుడు దేశ రవాణా రంగానికే ఆదర్శంగా ఉంది. 12,500 బస్సులతో 58 వేల మంది కార్మికులు, ఉద్యోగులు, అధికారులతో నిత్యం 70 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తూ ప్రజారవాణా వ్యవస్థగా పేరుపొందింది. అయితే ప్రయివేటు వాహనాల అక్రమ రవాణా వల్ల సంస్థ నష్టాల బాటలో నడుస్తోంది.  ఏ ఏటికాయేడు పెరుగుతున్న అప్పులతో ఆర్టీసీ మనుగడ కష్టంగా మారింది. రాష్ట్ర విభజనతో సుమారు రూ.1600 కోట్ల అప్పులు ఆర్టీసీకి గుదిబండగా మారాయి. విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఆర్టీసీ సంస్థకు ప్రభుత్వం ఎలాంటి చేయూతా ఇవ్వడం లేదు. దీంతో  ఏటా నష్టాలు తప్పడంలేదు. 2016–17 ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే సంస్థకు రూ.840 కోట్లు నష్టాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆర్టీసీ ప్రస్తుతం సుమారు రూ.4 వేల కోట్ల అప్పుల క్లబ్‌లోకి చేరింది. రోజుకు రూ.2 కోట్లు చొప్పున ఏడాదికి సుమారు రూ.750 కోట్లు వడ్డీ రూపంలో చెల్లించాల్సి వస్తోంది.

అక్రమ రవాణాను కట్టడి చేయాలి..
అక్రమ రవాణా వల్ల ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. రోజుకు కోట్లలో నష్టాలు వస్తున్నాయి. వేలాది బస్సులు, ఆటోలు చట్టవ్యతిరేకంగా నడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరం. లక్షల మంది ప్రయాణికులలో మమేకమైన ప్రజారవాణా వ్యవస్థను అందరం కాపాడుకోవాలి. రవాణా శాఖలో ఖాళీలను భర్తీ చేసి వారికి స్వేచ్ఛనివ్వాలి. ఉద్యోగులకు రక్షణనిస్తే ప్రైవేటు అక్రమ రవాణాను కట్టడి చేస్తారు.
– పలిశెట్టి దామోదరరావు, ఈయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి

ప్రభుత్వం తేల్చకుంటే ఆందోళన
అక్రమ రవాణాపై ప్రభుత్వం స్పందించి కట్టడి చేయాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఆర్టీసీని అందరం కలిసి రక్షించుకోవాలి. వేలాది వాహనాలు, ఆటోలు చట్టవ్యతిరేకంగా నడుస్తున్నాయి. దీనివల్ల ఆర్టీసీకి నష్టాలు వాటిల్లి సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. వేలాది మంది జీవితాలతో ముడిపడి ఉన్న ఆర్టీసీని కాపాడుకుందాం.
– వై.వి.రావు ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement