శ్రీకాకుళంలోని ఆర్టీసీ రెండో డిపో వద్ద గేట్‌మీటింగ్ నిర్వహిస్తున్న ఎన్‌ఎంయూ నేతలు
శ్రీకాకుళం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని విజయనగరం రీజనల్ మేనేజర్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టనున్నామని ఆర్టీసీలో గుర్తింపు సంఘమైన నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ) రీజనల్ అధ్యక్షుడు వై.అప్పయ్య, డివిజనల్ అధ్యక్షుడు శ్రీనివాసరావులు హెచ్చరించారు. శ్రీకాకుళంలోని ఆర్టీసీ రెండో డిపో గ్యారేజీ ఎదురుగా ఎన్‌ఎంయూ నాయకులు బుధవారం గేట్‌మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయనగరం రీజనల్ మేనేజర్‌కు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈ ఏడాది జనవరి 9న మెమోరాండం ఇచ్చామన్నారు.
సమస్యలపై విడతల వారీగా చర్చలు జరిపినప్పటికీ ఫలించలేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్‌ఎంయూ రీజనల్ కమిటీ నిర్ణయం మేరకు నెక్ రీజియన్‌లోని తొమ్మిది డిపోల్లో ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టనున్నామని వెల్లడించారు. ప్రధానంగా కార్మికులకు ఓటీ డ్యూటీలు రద్దు చేయాలని, ఎంటీడబ్ల్యూ చట్టం ప్రకారం డ్యూటీలు సరి చేయాలని, సిక్‌కు గురైన వారికి జీతాలు ఇవ్వాలని, కార్మికులందరికీ సెలవు సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే డీఎస్‌ఎం గేజ్ అయిన ఎస్సీ/ఎస్టీ డ్రైవర్లను విధుల్లోకి తీసుకోవాలని, ఒన్‌మన్ సర్వీసులను రద్దు చేయడంతోపాటు పాడైపోయిన టిమ్‌ల స్థానంలో కొత్త వాటిని సరఫరా చేయాలని, గ్యారేజీలో సూపర్‌వైజర్ల పక్షపాతవైఖరి నశించాలని తాము డిమాండ్ చేస్తున్నట్టు ఎన్‌ఎంయూ నేతలు చెప్పారు. గేట్ మీటింగ్‌లో శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల కార్యదర్శులు ఎంఎన్ రావు, వి.శాంతరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment