తిరుపతి: ఆర్టీసీ తిరుపతి రీజియన్లోని వివిధ డిపోలలోని మహిళా ఉద్యోగులపై వేధింపులు, ఆర్ఎం చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిరసనగా ఎన్ఎంయూ కార్మికులు శుక్రవారం మెరుపు సమ్మెకు పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 3.00 గంటల నుంచి జిల్లా వ్యాప్తంగా దాదాపు 1500 బస్సులలో 850 బస్సులు డిపోలకే పరిమితమైనాయి. జిల్లాలోని వివిధ డిపోల ముందుకు చేరిన ఎన్ఎంయూ కార్మికులు... సీఎం సొంత జిల్లాలో మహిళా కండక్టర్లకు రక్షణ కరువైందని పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
మహిళా కండక్టర్లను ఆర్టీసీ కంట్రోలర్ నాదముని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఆర్ఎంకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఎన్ఎంయూ కార్మికులు విమర్శించారు. దీంతో మెరుపు సమ్మెకు పిలుపు ఇచ్చినట్లు వారు తెలిపారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే బస్సు సర్వీసులు కూడా నిలిచిపోయాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.