అక్రమ రవాణా, ప్రైవేటీకరణపై పోరే లక్ష్యం
Published Wed, Jul 20 2016 6:47 PM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM
గోపాలపట్నం : అక్రమ రవాణా, ప్రైవేటు బస్సుల పెంపుపై ఉద్యమించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎన్‌ఎంయూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పీవీవీ మోహన్ స్పష్టం చేశారు. ఇక్కడి సింహాచలం ఆర్టీసీ గ్యారేజి డిపో వద్ద బుధవారం కార్మిక ఐక్యత కోరుతూ నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా డిపో కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌కు 2 కిలోమీటర్ల దూరంలో ప్రైవేటు బస్సులను ఉంచాలన్న నిబంధన ఆచరణలో ఉండాలని, మేక్సీ క్యాబ్‌లు, జీపులు, ఆటోలు పరిమితికి మించి రవాణా చేయకూడదని, హైవేలో ఆటో ప్రయాణాలు ఆపాలని ఇప్పటికే డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌కు నివేదించామన్నారు. టూరిస్టు పర్మిట్లతో స్టేజి కేరియరు సర్వీసులు నడపడం, ఒకే నంబరుతో మూడు నాలుగు బస్సులు అక్రమ రవాణా జరిగిపోతుండడంపైనా తాము అభ్యంతరం చెప్పామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 3000 ఆర్టీసీ బస్సులు రానున్నాయని తొలి విడతగా పుష్కరాల సర్వీసులకు ఆరువందల బస్సులు ప్రారంభమవుతాయన్నారు. ఆర్టీసీ బస్ డ్రైవర్లు, కండక్టర్లపై అధికారులు అన్యాయంగా పనిష్మెంట్లు ఇస్తున్నారని, ఇలాంటి ఇబ్బందులు రాకుండా గుర్తింపు యూనియన్ నుంచి నలుగురు, ఆర్టీసీ అధికారుల నుంచి నలుగురితో ఒక కమిటీ ఏర్పాటు కానుందన్నారు. రీజినల్ పబ్లిసిటీ కార్యదర్శి టీవీ శర్మ, డివిజినల్ వర్కింగ్ అధ్యక్షుడు డీకే రాజు, డిపో అధ్యక్ష కార్యదర్శులు డీఏనాయుడు, ఎస్. అప్పారావు, గ్యారేజి అధ్యక్షుడు సాయిబాబా తదితర నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement