ఎన్నికల కోలాహలం
18న ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికలు
ప్రచారాలతో హోరెత్తిస్తున్న కార్మిక సంఘాలు
కార్మిక ఓట్లు రాబట్టేందుకు
ముమ్మర యత్నాలు
పట్నంబజారు (గుంటూరు): ఏపీఎస్‌ఆర్టీసీలో గుర్తింపు ఎన్నికల కోలాహలం నెలకొంది. కార్మిక సంఘాలు పూర్తిస్థాయిలో రీజియన్ పరిధిలోని 13 డిపోల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ నెల 18న ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. గుంటూరు రీజయన్ పరిధిలో 5963 కార్మిక ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం జరుగుతున్న తొలి గుర్తింపు ఎన్నికలు కావడంతో సంగ్రామాన్ని తలపిస్తోంది. కార్మిక సంఘాలు ఈ ఎన్నికలకు పూర్తి ప్రాధాన్యం ఇస్తూ, తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. కార్మిక సంఘాల నేతలు తమదైన శైలిలో ప్రచారాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ), ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), కార్మిక పరిషత్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్)తోపాటు మరో నాలుగు కార్మిక సంఘాల పోటీకి దిగుతున్నాయి.
బ్యానర్లు, ఫ్లెక్సీలతో కళకళ
ఇప్పటికే ఆర్టీసీ బస్‌స్టాండ్‌తో పాటు, రీజియన్ పరిధిలోని డిపోలన్నీ బ్యానర్లు, ఫ్లెక్సీలతో కళకళలాడుతున్నాయి. కార్మిక నేతలను సైతం పోటీలు పడి మరీ బ్యానర్లు, ఫ్లెక్సీలు కడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర కమిటీ నేతలతో ఎన్‌ఎంయూ, ఎస్‌డ బ్ల్యూఎఫ్ సంఘాలు భారీ బహిరంగ సభలు నిర్వహించగా, కార్మిక పరిషత్, ఎంప్లాయీస్ యూనియన్‌లు సభలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నాయి.ఎన్‌ఎంయూ రీజియన్ ప్రధాన కార్యదర్శి కేవీఎస్ నరసింహారావు, కార్మిక పరిషత్ నేత మురళి, ఎస్‌డబ్ల్యూఎఫ్ రీజియన్ ప్రధాన కార్యదర్శి డీవీ స్వామి ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణను పరిశీలిస్తున్నారు.
దీంతోపాటు పలువురు ఎన్‌ఎంయూ నేతలు ఈయూలో చేరడం, పలువురు ఈయూ నేతలు ఎన్‌ఎంయూలో చేరడంతో గట్టిపోటీ వాతవరణం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పూర్తిస్థాయిలో ప్రచార కార్యక్రమాన్ని కార్మిక సంఘాలు పూర్తిచేసేస్తున్నాయి. ప్రచారానికి ఈనెల 16వ తేదీ సాయంత్రం వరకు గడువు ఉండడంతో కార్మిక సంఘాల నేతలు చకచకా పావులు కదపుతున్నారు. కరపత్రాలు పంపిణీ చేయడంతో పాటు, పోస్టర్ల ప్రచారాన్ని భారీగా చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌పైనా కార్మిక సంఘాల నేతలు దృష్టి సారిస్తున్నారు. ఎన్నికల ముందు రోజు రాత్రి గుంటూరు రీజియన్ నుంచి దూరప్రాంతాలు వెళ్లే వారి లిస్టులు సేకరించే పనిలో ఉన్నారు. సుమారు 100 నుంచి 150 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఉండే అవకాశం ఉందని కార్మిక నేతలు చెబుతున్నారు.