ఈయూ గెలుపు
ఈయూ గెలుపు
Published Fri, Dec 16 2016 10:08 PM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM
ముగిసిన ఆర్టీసీ సీసీఎస్ ఎన్నికలు
– ఈయూ, మిత్రులకు 11, ఎన్‌ఎంయూకు 6 స్థానాలు
– గుర్తింపు ఎన్నికల తరహాలో హోరాహోరీ
– 12 డిపోల్లో 17 డెలిగేట్స్ పోస్టులు
– ప్రశాతంగా ముసిగిన పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ
కర్నూలు(రాజ్‌విహార్): రోడ్డు రవాణా సంస్థ కర్నూలు రీజియన్‌లో నిర్వహించిన క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ(సీసీఎస్) ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ విజయకేతనం ఎగురవేసింది. మిత్ర సంఘాలతో కలిసి పోటీ చేసి అధిక స్థానాల్లో గెలుపొందింది. రాష్ట్రంలో గుర్తింపులోని నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు పరాభవం ఎదురవడంతో నిరాశ తప్పలేదు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగింది. జిల్లా వ్యాప్తంగా 12 డిపోల్లో 17 డెలిగేట్ స్థానాలకు పోటాపోటీగా సాగిన ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ మిత్ర సంఘ సభ్యులతో కలిసి పోటీకి దిగి 11 స్థానాల్లో గెలువగా నేషనల్ మజ్దూర్ యూనియన్ 6 స్థానాలతో సరిపెట్టుకుంది. గెలుపు కోసం డబ్బును వెదజల్లి మద్యాన్ని పారించిన తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం కార్మిక పరిషత్ ఒక్క చోట కూడా గెలవలేదు.
ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తమ సొమ్మును దాచుకోవడంతో పాటు రుణాలు పొందే వీలుతో ఈ సొసైటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న డైరెక్టర్ల కాలపరిమితి శుక్రవారంతో ముగిసింది. దీంతో కొత్త ప్రతినిధులను ఎన్నుకునే క్రమంలో నవంబర్ 16న ఎన్నికలకు నోటిఫికేషన్, షెడ్యూల్‌ను సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఎన్నికైన డెలిగేట్లు ఐదేళ్లపాటు కొనసాగుతారు.
ఈయూ ఆధిపత్యం
గుర్తింపు సంఘం ఎన్నికలను తలపించేలా జరిగిన ఈ ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈయూకు 9 స్థానాలు రాగా మిత్ర సంఘం ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు రెండు స్థానాలొచ్చాయి. ఎన్‌ఎంయూ మాత్రం 6 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ సంఘానికి కంచుకోటలా ఉన్న కర్నూలు–1 డిపోను సైతం కోల్పోయింది. డెలిగేట్ల ఎన్నికలు గుర్తింపు ఎన్నికల తరహాలో బ్యాలెట్ పేపరులో 'గుర్తు'కు బదులుగా వరుస సంఖ్య, అభ్యర్థి పేరు మీదుగానే జరిగాయి. ఓటర్లు ఎన్‌ఎంయూ వైఫల్యాలను ఎండగడుతూ ఈయూకు పెద్దపీట వేశారు. కర్నూలు రీజియన్(జిల్లా)లో 12డిపోలు ఉండగా ఇందులో 17 డిలిగేట్ పోస్టులు ఉన్నాయి. కర్నూలు–1డిపోతో పాటు ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, కర్నూలు–2 డిపోల్లో రెండేసి పోస్టులుండగా ఆత్మకూరు, నందికొట్కూరు, డోన్, బనగానపల్లె, పత్తికొండ, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ డిపోలకు ఒక్కో పోస్టు ఉంటుంది. ఈ స్థానాల్లో పోటీకి 35 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ 17 డెలిగేట్ పోస్టులకు ఒంటరిగా పోటీ చేస్తుండగా.. ఎంప్లాయీస్ యూనియన్ మాత్రం వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సహకారంతో 17 మంది అభ్యర్థులను బరిలో దించింది. మరో 20 మంది ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు. గెలిచిన అభ్యర్థులు త్వరలో రాష్ట్ర సొసైటీ డైరెక్టర్లను ఎన్నుకోనున్నారు.
గెలుపు సంఘాల సంబరాలు
సీసీఎస్ ఎన్నికల్లో గెలిచి సంఘాలు ఆయా డిపోల వద్ద పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాయి. కర్నూలులోని కొత్త బస్టాండ్ ఆవరణలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు బాణసంచా పేల్చి స్వీట్లు పంచిపెట్టారు.
పారని 'పచ్చ' పాచిక
సీసీఎస్ ఎన్నికల్లో తమ అనుబంధ సంఘాన్ని గెలిపించుకునేందుకు తెలుగుదేశం తమ్ముళ్లు చేసిన కుట్రలు ఫలించలేదు. గురువారం రాత్రి ప్రలోభాలకు తెరలేపి డ్రైవర్, కండక్టర్లతో పాటు వివిధ కార్మికులు, ఉద్యోగులను రహస్యంగా కలసి డబ్బు పంపిణీ చేసినట్లు సమాచారం. ఓటరుకు రూ.2 వేల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మద్యం బాటిళ్లు, బిర్యానీ పాకెట్లు అందించి తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేక ఆ సంఘం జిల్లా వ్యాప్తంగా ఘోరంగా ఓడిపోయింది.
Advertisement
Advertisement