► ఆర్టీసీ యాజమాన్యంపై ఎన్‌ఏంయూ నేతల ధ్వజం
బస్‌స్టేషన్ (విజయవాడ తూర్పు) : ఆర్టీసీ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా ఉందని ఎన్‌ఏంయూ (నేషనల్ మజ్దూర్ యూనియన్) గ్యారేజి వర్క్‌షాపు నేతలు ధ్వజమెత్తారు. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లోని ఎన్‌ఏంయూ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం గ్యారేజీ వర్క్‌షాపు నేతలతో రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. బస్సుల పనితీరును పరిశీలించే విభాగంపై యాజమాన్యం వహిస్తున్న నిర్లక్ష్య ధోరణితో వస్తున్న సమస్యల్ని రాష్ట్ర వ్యాప్తంగా హాజరైన జోనల్ నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు చల్లాచంద్రయ్యకు వివరించారు.
చల్లాచంద్రయ్య మాట్లాడుతూ కనీసం కారుకు తీసుకున్న జాగ్రత్తల్ని సైతం బస్సుకు తీసుకోకపోవడం దారుణమన్నారు. మానవశక్తి, విడిభాగాలు అందించడంలో యాజమాన్యం విఫలమయ్యిందన్నారు. అవి లేక గ్యారేజీల్లో కార్మికులు పనులు చేయలేకపోతున్నారన్నారు. మారుతున్న కాలనుగుణంగా విడిభాగాల్ని అందించలేకపోతున్నారన్నారు. దశబ్దాలుగా గ్యారేజీలో బస్సు పరిశీలన విభాగంలో ఉన్న 4 షెడ్డుల్ని కుదించేందుకు అధికారులు ఆలోచిస్తున్నారన్నారు. ఈ సమస్యల్ని యాజమాన్యం పరిష్కరించకపోతే ప్రభుత్వం జోక్యం చేసుకుని కొత్త బస్సులు వస్తేనే సమస్యలకు పరిష్కారమన్నారు. చల్లా చంద్రయ్య మాట్లాడుతూ ఈ సమస్యలపై యాజమాన్యంతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు రావి సుబ్బారావు, తోట వెంకటేశ్వరరావు, శ్రీనివాసులు, జోన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం
Published Thu, Jun 15 2017 9:32 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM
Advertisement