ఆమదాలవలసలో తాండ్రసిమెట్ట వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో నిర్మించిన ఆక్విడెక్ట్
సాక్షి, ఆమదాలవలస(శ్రీకాకుళం): అది 2004వ సంవత్సరం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తూ జిల్లాకు వచ్చారు. ఇక్కడ రైతుల పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా చూసిన ఆయన చలించిపోయారు. అన్నపూర్ణగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లాలో సాగునీరు అందక పంటలు పండడం లేదనే విషయాన్ని రైతుల నుంచి తెలుసుకున్నారు. అప్పుడే రైతులకు భరోసా ఇచ్చారు. మంచి రోజులు వస్తాయి, రైతన్న కల నెరవేరుతుందని చెప్పారు. అన్నట్టుగానే వంశధార కుడికాలువకు అనుసంధానంగా వయోడెక్ట్‌ను నిర్మించి వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేశారు. డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో 2007లో ఆమదాలవలస మండలం తాండ్రసిమెట్ట వద్ద వంశధార కుడి ప్రధాన కాలువకు అనుసంధానంగా ఆక్విడెక్ట్(వయోడెక్ట్)ను ప్రారంభించారు. ఈ సాగునీటి కాలువ నిర్మాణం లేక ముందు రెండు మండలాల్లో పంటపొలాలకు సాగునీరు అందక బీడు భూములుగా ఉండేవి.
ఆసియాలోనే మొదటిసారిగా..
వైఎస్‌ఆర్ ప్రభుత్వ పాలనలో సుమారు రూ.10 కోట్ల వ్యయంతో వంశధార కుడి ప్రధాన కాలువకు అనుసంధానంగా ఆక్విడెక్ట్ నిర్మాణం చేశారు. ఈ నిర్మాణం వల్ల ఆమదాలవలస, శ్రీకాకుళం మండలాల్లో 32 వేల ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందుతోంది. ఈ ఆక్విడెక్ట్ నిర్మాణం కూడా ఆసియా ఖండంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రాంతంలోనే నిర్మించారు. ఆక్విడెక్ట్ నిర్మించే సమయంలో రైల్వే ట్రాక్ అడ్డంగా ఉంటే రైల్వే రాకపోకలకు అంతరాయం కలుగకుండా భూమిలోపల నుంచి సాగునీటి కాలువను నిర్మించారు. రైల్వేట్రాక్‌కు మధ్యలో ఉన్న ఈ ఆక్విడెక్ట్ నిర్మాణాన్ని సందర్శించేందుకు చాలా మంది టూరిస్ట్‌లు ఇక్కడకు వస్తుం టారు. రెండు మండలాలకు సాగునీటిని అందించిన ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుంది. వేలాది ఎకరాలకు సాగునీరు అందించడంతో రైతు బాంధవుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని రైతులు చెబుతున్నారు.
సాగునీటి రంగానికి పెద్దపీట
వైఎస్సార్ హయాంలో సాగునీటి రం గానికి పెద్ద పీట వేయడంతో ప్రస్తుతం ఇప్పుడు వేలాది ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందుతోంది. సాగునీరు అందక పంటపొలాలు బీడు భూములుగా మారుతున్న సమయంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వయోడెక్ట్ నిర్మాణం చేపట్టి 32 వేల ఎకరాలకు సాగునీరు అందించారు. దీంతో పాటు చింతాడ గ్రామం వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి మెట్ట ప్రాంతాలకు కూడా సాగునీరు అందించిన ఘనతను దక్కించుకున్నారు.
– బోర చిన్నంనాయుడు, రైతు, చింతాడ, ఆమదాలవలస
Comments
Please login to add a commentAdd a comment