పెరటి చెట్టు మందుకు పనికిరాదన్న చందంగా తయారైంది ఎచ్చెర్ల నియోజకవర్గం పరిస్థితి. నియోజకవర్గంలో అన్ని సదుపాయాలూ ఉన్నా పాలకుల నిర్లక్ష్యం వల్ల యువతకు ఉపాధి దొరకడం లేదు. రైతులకు సాగునీరు అందడం లేదు. విద్యార్థులకు సక్రమంగా విద్యాబోధన లేదు. మత్స్యకారులు పొట్టచేతబట్టుకుని వలస పోక తప్పడం లేదు. నియోజక వర్గం ఏర్పడిన నాటి నుంచి ఇంతవరకు పలు రాజకీయ పార్టీలకు చెందిన వారు, స్వతంత్రులు ఎంఎల్‌ఏలుగా గెలుపొందినప్పటికీ నియోజకవర్గంలో అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంది. వచ్చే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు పోటీ పడుతున్నా పోటీ మాత్రం ప్రధానంగా అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ మధ్యే ఉన్నట్లు కనిపిస్తోంది. ఓ సారి నియోజకవర్గం పరిస్థితిని పరిశీలిస్తే..
ఎచ్చెర్ల నియోజకవర్గం జిల్లాలోనే ప్రత్యేకం. జిల్లా ముఖ ద్వారం పైడిభీమవరం ఈ నియోజకవర్గంలోనే ఉంది. మరో పక్క శ్రీకాకుళం పట్టణాన్ని అనుకుని ఉన్న మండలం ఎచ్చెర్ల. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ, రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఎచ్చెర్ల మండలం లో ఉన్నాయి. పైడిభీమవరం పారిశ్రామిక వా డ నియోజకవర్గంలోనే ఉంది. తోటపల్లి, నారాయణపురం, మడ్డువలస ప్రాజక్టుల ద్వా రా నియోజకవర్గానికి సాగునీరు అందుతుం ది. జిల్లాలోనే వైవిధ్యభరిత నియోజకవర్గం ఇది. నియోజక వర్గ పాలకుల్లో అంకితభావం లేకపోవడమే నియోజక వర్గ ప్రగతి కుంటుపడుతుండడానికి ప్రధాన కారణంగా చెప్పవ చ్చు. అభివృద్ధికి అవకాశం ఉన్న నియోజ కవర్గంలో ఇంకా వెనుకబాటు తప్పడం లేదు.
ఎచ్చెర్ల నియోజక వర్గం 1967లో ఏర్పాటైంది.
సిటింగ్ ఎంఎల్‌ఏకు అసమ్మతి సెగ
ప్రస్తుత రాష్ట్ర మంత్రి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావు ఈ నియోజకవర్గం నుంచి అధికార తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నియోజకవర్గ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనపై వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్ పోటీ పడుతున్నారు. నియోజకవర్గం ఏర్పడిన తరువాత అత్యల్ప మెజారిటీతో 2014 ఎన్నికల్లో 4,741 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సిటింగ్ ఎంఎల్‌ఏ కళాకు నియోజకవర్గంలో ప్రతికూల వాతావరణం స్పష్టంగా ఉంది. పార్టీకి అండగా ఉన్నవారిని కాదని, కొత్త నాయకులకు ఆయన ప్రాధాన్యం ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తిలో స్థానిక నాయకులు ఉన్నారు. జెడ్పీ చైర్మన్ చౌదరి ధనలక్ష్మి వర్గంతో కళా వెంకటరావుకు దీర్ఘకాలిక వైరం ఉంది. మరోపక్క రణస్థలం మండలంలో కాపు సామాజక వర్గాన్ని కాదని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు నడికుదిటి ఈశ్వరరావుకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయడిని పార్టీలోకి తీసుకు రావడంతో మొత్తం టీడీపీ నాయకులు దాదాపుగా పార్టీని వీడారు. మరో పక్క తమ పట్టు చూపించేందుకు బూరాడ వెంకటరమణ వంటి వారు ఎదురు చూస్తున్నారు.
కిరణ్‌కుమార్‌కు పెరుగుతున్న ఆదరణ
గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్ ఓటమి పాలయ్యారు. అప్పటినుంచి ఆయన ప్రజల మధ్యనే ఉన్నారు. మరో పక్క కిరణ్ స్థానికుడు. రణస్థలం మండలంలోని పాతర్లపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. ఇది ఆయనకు కలిసివచ్చే అంశం. కళావెంకటరావు రాజాం నియోజక వర్గంలోని రేగిడి మండలానికి చెందిన వ్యక్తి. దీంతో ఈ సారి స్థానికుడికి మద్దతు ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. మరో పక్క గత 10 రోజులుగా వైఎస్‌ఆర్‌సీపీ బలం పుంజుకుంది. ఎచ్చెర్ల, లావేరు, జి.సిగడాం, రణస్థలం మండలాల్లో 20 వేల వరకు ఓట్లను ప్రభావితం చేయగలిగే క్యాడర్ వైఎస్సార్‌సీపీలో చేరడం గమనార్హం. దీంతో అనూహ్యంగా వైఎస్సార్‌సీపీ బలం పుంజుకుంది. మరో పక్క క్షేత్రస్థాయిలో జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర తరువాత ఒక్కసారిగా పార్టీకి ఆదరణ రెట్టింపైంది. అన్ని ప్రాంతాల్లో ఫ్యాన్ గాలి జోరుగా వీస్తోంది. ఈ గాలిని అడ్డుకునేందుకు డబ్బు, మద్యం వంటి వాటిని అధికార పార్టీ నమ్ముకున్నా..ప్రజలు మాత్రం ఫ్యాన్ గుర్తుకు ఓటేసేందుకు ఇప్పటికే ఫిక్స్ అయ్యారు.
అరకొరగా సాగునీరు
ఎచ్చెర్ల నియోజక వర్గంలో రణస్థలం, లావేరు, జి.సిడాం మండలాలకు 45 వేల ఎకరాలకు తోటపల్లి సాగునీరు అందాలి. ఇప్పటికీ పిల్లకాల్వల వ్యవస్థ పూర్తికాలేదు. జి.సిగడాంలో 5,000 ఎకరాలకు నీరు అందవల్సిన మడ్డువల్స నీరు సజావుగా శివారు భూములకు అందడం లేదు. ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎం పురం పెద్ద చెరువుకు మిగులు జలాల తరలింపు ప్రశ్నార్థకంగా మారింది. ఎచ్చెర్ల మండలంలో 7,500 ఎకరాలు నారాయణపురం కుడికాల్వ కింద సాగునీరు అందాల్సి ఉండగా, ఏటా రైతులకు ఖరీఫ్‌లో సాగునీటి కష్టాలు తప్పడం లేదు.
నిర్లక్ష్యపు వర్శిటీ..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీలో కనీసం 120 మంది రెగ్యులర్ బోధకులు ఉండాల్సి ఉండగా, 11 మంది మాత్రమే రెగ్యులర్ బోధన సిబ్బంది ఉన్నారు. వర్సిటీలో మౌలిక వసతులు ప్రధాన సమస్య. 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఒక్కో ఏడాది క్యాపిటల్ గ్రాంట్ కింద రూ. 40 కోట్లు మంజూరు చేసినా, నిధులు విడుదల కాలేదు. వర్సిటీకి ప్రభుత్వం అప్పగించిన 130 ఎకరాలకు ప్రహరీ సైతం లేని దుస్థితి. వసతి గృహాలు, తరగతి గదుల కొరత వెంటాడుతోంది. విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్న ఆరోపణలు విస్తృతంగా ఉన్నాయి. 49 మంది బోధకుల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినా ఒక్క పోస్టునూ భర్తీ చేయలేదు.
కలుషిత జలాలే దిక్కు
ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు మండలాల్లో చాలా గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. అయినా సురక్షిత తాగునీరు అందించ డం లేదు. గ్రామాల్లో నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎన్టీఆర్ సుజల ధార మాత్రం అమలు కావడం లేదు. ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు.
మూడు వేల మంది విద్యార్థులకు ప్రవేశాలు జరగ్గా..
శ్రీకాకుళంలో 2016లో రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. 2016–17లో 1000, 2017–18లో 1000, 2018–19లో 1000 మందికి ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు కల్పించారు. అయితే ఇక్కడ పీయూసీ రెండో సంవత్సరం తరగతులు మాత్రమే సాగుతున్నాయి. మిగతా తరగతలు కృష్ణా జిల్లాలోని న్యూజివీడులో సాగు తున్నాయి. రెండో సంవత్సరం పీయూసీ సైతం ఏర్పాటు సమయంలో సిద్ధంగా ఉన్న 21వ శతాబ్ది గురుకులం భవనాల్లో 500 మంది హిళలకు, అద్దెకు తీసుకున్న మిత్రా ఇంజినీరింగ్ కళాశాలలో 500 మందికి తరగతులు నిర్వహిస్తున్నారు. మూడు వేల మందితో తరగతులు నిర్వహించాల్సిన ట్రిపుల్ ఐటీని నిర్వీర్యం చేశారు. మరో పక్క కాంట్రాక్ట్ సిబ్బందితో మాత్రమే తరగతులు నిర్వహిస్తున్నారు.
మూత పడుతున్న పరిశ్రమలు
పైడిబీమవరం, ఎచ్చెర్ల, నవభారత్ ప్రాంతాల్లో పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం లేక పరిశ్రమలు మూతపడుతున్నాయి. స్వర్ణాంధ్ర జూట్ మిల్లు, వరం పవర్ ప్లాంట్ వంటి పరిశ్రమలు మూత పడ్డాయి. మరో పక్క స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడం లేదు. మూతపడుతున్న పరిశ్రమలు, ఉన్న పరిశ్రమల్లో ఉపాధి లేక పోవటంతో యువత ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఇంతవరకు ఎమ్మెల్యేల వివరాలివి.
సంవత్సరం విజేత పార్టీ
1967 నడిమింటి అప్పల నాయుడు కాంగ్రెస్
1972 బల్లాడ హరప్పడు రెడ్డి స్వతంత్ర
1978 కొత్తపల్లి నర్సయ్య జనతా
1983 కావలి ప్రతిభాభారతి టీడీపీ
1985 కావలి ప్రతిభాభారతి టీడీపీ
1989 కావలి ప్రతిభాభారతి టీడీపీ
1994 కావలి ప్రతిభాభారతి టీడీపీ
1999 కావలి ప్రతిభాభారతి టీడీపీ
2004 కోండ్రు మురళీమోహన్ కాంగ్రెస్
2009 మీసాల నీలకంఠనాయుడు కాంగ్రెస్
2014 కమిడి కళావెంకటరావు టీడీపీ
ఓటర్లు: 2,23.369
పురుషులు: 1,13,730
మహిళలు: 1,09,564
ఇతరులు: 25
Comments
Please login to add a commentAdd a comment