
ఆరాధ్య(ఫైల్)
ప్రకాశం: ఏడాదిన్నర వయసున్న ఓ చిన్నారి దారుణ హత్యకు గురైన ఘటన ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నగరంలో బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఆరాధ్య అనే ఏడాదిన్నర చిన్నారి మంగళవారం అదృశ్యమైన సంగతి తెలిసిందే. కోండ్రు లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఆరాధ్యను గొంతునులిమి, పెట్రోల్ పోసి నిప్పుపెట్టి అతిదారుణంగా చంపేశాడు. నిందితుడు చిన్నారికి బాబాయ్. లక్ష్మీనారాయణ తన భార్యతో సన్నిహితంగా ఉండటానికి పాప అడ్డుగా ఉందని ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. పోలీసులు నిందితుడుని అరెస్ట్ చేశారు.
కాగా, ఒంగోలు నగరంలోని రాజపానగల్ రోడ్డులోని 7వ లైనులో నివాసం ఉంటున్న కుందా ఆరాధ్య మంగళవారం మధ్యాహ్నం నుంచి కనపడకుండా పోయింది. దాంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. తల్లి సాహితీ ఇంట్లో పనిచేస్తుండగా పాప ఇంటి బయట ఆడుకుంటోంది. తరువాత పాప కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.