సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఎవరు ముక్కున వేలేసుకున్నా సరే..! జిల్లాలోని కాంగ్రెస్ నాయకులందరూ సామాజిక కార్యకర్తలుగా మారిపోయారు. ఒకరిద్దరు కాదు.. ఏకంగా 204 మంది చోటా.. బడా నేతలందరూ ఈ జాబితాలో చేరిపోయారు. ఇన్‌చార్జి మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెల్లె కోడూరి సరోజనతోపాటు చొప్పదండి నియోజకవర్గ ఇన్‌చార్జి గునుగొండ బాబు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎం.లక్ష్మయ్య, కొండ రాజమ్మ, అంగోతు సుగుణ, గజభీంకార్ రాజన్న, గుండారపు శోభ, ఎల్లాల రాజయ్య, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ గంగాధర్, మరో 11 మంది మాజీ ఎంపీపీలు, 46 మంది సర్పంచ్‌లు, 31 మంది కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఈ జాబితాలో ఉన్నారు.
స్వయానా ఇన్‌చార్జి మంత్రి పొన్నాల లక్ష్మయ్య వీరందరినీ సామాజిక కార్యకర్తలుగా ధ్రువీకరించి, ప్రభుత్వ సంక్షేమ, ఉపాధి పథకాలకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను అప్పగించారు. మొత్తంగా జిల్లాలో స్క్రీనింగ్ కమిటీల నియామకం అభాసుపాలైంది. ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ కమిటీలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ‘హస్త గతం’ చేసుకుంది. స్క్రీనింగ్ కమిటీల నియామకానికి జారీ చేసిన ఉత్తర్వులను, మార్గదర్శకాలను తమ పార్టీకి అనుకూలంగా మలుచుకుంది.
ఎంపీడీవో కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీలో మండల స్థాయి అధికారులతో పాటు అక్కడి బ్యాంకు మేనేజర్లు, మండల సమాఖ్య అధ్యక్షురాలు, డీఆర్‌డీఏ ప్రతినిధితో పాటు ముగ్గురు సామాజిక కార్యకర్తలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్‌చార్జి మంత్రి నామినేట్ చేసిన వారిని సామాజిక కార్యకర్తలుగా నియమించాలని, ముగ్గురిలో ఒక మహిళ ఉండాలని నిర్దేశించింది. దీన్ని తమకు అనువుగా మలుచుకున్న మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్, విప్ ఆరెపల్లి మోహన్, ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డితో పాటు అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌చార్జీలు ఎవరికివారుగా తమ పరిధిలోని మండలాలు, పట్టణాల్లో పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, క్రియాశీలంగా పని చేస్తున్న నాయకుల పేర్లను సిఫారసు చేశారు.
ఈ సిఫారసులను స్వీకరించిన జిల్లా అధికారులు.. యథాతథంగా జాబితాలు రూపొందించి ఇన్‌చార్జి మంత్రితో ఆమోద ముద్ర వేయించారు. మంగళవారం సాయంత్రం జిల్లా యంత్రాంగం సంబంధిత నియామకపు ఉత్తర్వులను జారీ చేసింది. 57 మండలాలతో పాటు 11 పట్టణాలకు ముగ్గురి చొప్పున జాబితాను విడుదల చేసింది. వచ్చే నెలాఖరుకల్లా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందనే ప్రచారంతో పాటు ప్రస్తుతం జిల్లాలో పని చేస్తున్న ఎంపీడీవోలు, తహసీల్దార్లు దాదాపు 90 శాతానికి పైగా పదో తేదీలోగా బదిలీపై వెళ్లనున్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లతో పాటు ట్రైకార్‌కు సంబంధించిన సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికను నెలాఖరులోగా పూర్తి చేయాలని, ఫిబ్రవరి 7వ తేదీ వరకు మంజూరీ ఉత్తర్వులు జారీ చేయాలని కలెక్టర్ వీరబ్రహ్మయ్య ఆదేశాలు జారీ చేశారు.
వీలైనంత తొందరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికార యంత్రాంగం హడావుడి పడుతుంటే... ఇదే అవకాశంగా పార్టీ కార్యకర్తలు, అనుచర గణాన్ని లబ్ధిదారులుగా ఎంపిక చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు ఉబలాటపడుతున్నారు. దీంతో లబ్ధిదారుల ఎంపిక గందరగోళంగా మారనుంది. ప్రధానంగా ఇతర పార్టీల ప్రభావం ఉన్న చోట లబ్ధిదారుల ఎంపిక అధికారులకు కత్తి మీద సాములా పరిణమించనుంది. ఇవేవీ పట్టించుకోకుండా.. ఎన్నికల సమయం కావటంతో ఓట్లను తెచ్చిపెట్టేందుకు ఈ కమిటీలు, ఎంపిక ప్రక్రియ తమకు ఉపయోగపడుతుందని అధికార పార్టీ అంచనాలు వేసుకుంటోంది.
‘చేయి’కి చిక్కాలని..
Published Wed, Jan 29 2014 4:10 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement