
నల్లమలలో ఆయుధాల డంప్
♦ తూటాలు తయారు చేసే యంత్రం,నాటు తుపాకులు, 600 బుల్లెట్లు స్వాధీనం
♦ గుత్తికొండ వద్ద అనుమలతండా అటవీ ప్రాంతంలో డంప్ స్వాధీనం
♦ నల్లమల అడవిని జల్లెడపడుతున్న ఏఎన్‌ఎస్
సాక్షి, గుంటూరు/పిడుగురాళ్ళ: నల్లమల అడవుల్లో భారీ ఆయుధాల డంప్ పోలీసులకు దొరకడం తీవ్ర సంచలనం కలిగించింది. 4 నెలలుగా నల్లమల అటవీ ప్రాంతంలో మావోయిస్టు కదలికలున్నాయన్న నిఘావర్గాల హెచ్చరికతో పోలీసులు కూంబింగ్‌ను ఉధృ తంచేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గుత్తికొండ గ్రామంలో తూటాలు తయారుచేసే యంత్రాలున్నాయనే సమాచారంతో యాంటీ నక్సల్స్ స్క్వాడ్ (ఏఎన్‌ఎస్) సోమవారం అక్కడకు చేరుకుంది.
నక్సలైట్లు వాడే ఆయుధాలు, తూటాలను తయారుచేసే యంత్రాలను స్వాధీనం చేసుకుని, అక్కడున్న నలుగురైదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 3 ప్రత్యేక వాహనాల్లో పిడుగురాళ్లకు తరలించారు. గుత్తికొండకు ఐదు కిలోమీటర్ల దూరంలో నల్లమల అడవిలోని వేమగిరి, అనుమల వద్ద యాంటీ నక్సల్స్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించి వీటిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. తూటాలు తయారు చేసే యంత్రంతోపాటు, నాటు తుపాకులు, 600 బుల్లెట్లు, తూటాలు తయారు చేసే సామగ్రిని పోలీసులు స్వాధీ నం చేసుకున్నట్లు తెలిసింది. ఇది 2003లో తయారు చేసిన యంత్రమని పోలీసులు అనుమానిస్తున్నారు.
మావోయిస్టులకు అత్యంత పట్టున్న గ్రామంగా పేరొందిన గుత్తికొండ వద్ద అటవీ ప్రాంతంలో ఆయుధాల డంప్‌ను స్వాధీనం చేసుకోవడం చూస్తుంటే మళ్లీ మావోయిస్టు కదలికలు మొదలయ్యాయనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోలీసులు ఈ ఘటనపై నోరు మెదపడం లేదు. పూర్తిగా విచారణ నిర్వహించిన తర్వాతే సమాచారం వెల్లడిస్తామని గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ కె.నారాయణనాయక్ చెప్పారు. ఈ డంప్‌ను మంగళవారం గుంటూరుకు తరలించనున్నట్లు సమాచారం.