పేదలకు ‘ఆరోగ్య శ్రీ’రామరక్ష
* ప్రపంచ బ్యాంక్ అధ్యయనంలో వెల్లడి
* వైఎస్సార్ తెచ్చిన పథకం ఆదుకుందన్న ప్రజలు
‘రాష్ట్రంలో(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) వేలాది పేద కుటుంబాలను పలకరించాం. ఒకసారి కాదు.. రెండు మూడు దఫాలుగా వివిధ గ్రామాలు, పట్టణాల్లో పేదలను కలిశాం. ఎవరిని అడిగినా ఆరోగ్యశ్రీ పథకం గురించి అనర్గళంగా చెప్పారు. 80 శాతం మంది తమకు ఈ పథకం వర్తించిందని తెలిపారు. అంతెందుకూ నాటి పాలక పార్టీ(కాంగ్రెస్)ని మళ్లీ అధికారంలోకి తేవటానికి ఇది ఎంతో ఉపయోగపడిందని మా అభిప్రాయం’
- వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకంపై ప్రపంచబ్యాంక్ అధ్యయనంలో వెల్లడైన సత్యాలివి.
సాక్షి, హైదరాబాద్: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం గురించి ప్రపంచబ్యాంకు అధ్యయనం జరిపి తాజాగా రూపొందించిన నివేదిక జనాభిప్రాయాన్ని తేటతెల్లం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంతో ప్రీతిపాత్రమైన ప్రపంచబ్యాంకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్వయంగా అధ్యయనం చేసి వాస్తవాలను నిర్ధారించింది. మూడు దఫాలుగా వేలాది కుటుంబాల వద్దకు వెళ్లి ఆరోగ్యశ్రీ పథకంపై ప్రజల అభిప్రాయాలను కోరింది. ఇందులో 80 శాతానికి పైగా కుటుంబాలు ముక్తకంఠంతో ఒకే మాట చెప్పాయి. ఆరోగ్యశ్రీ కనుక లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్లమని, ఈ పథకం ద్వారానే కోలుకోగలిగామని తెలిపారు.
వివిధ జిల్లాలో 8,600 కుటుంబాల ను సర్వే చేయగా 71 శాతం మంది ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందామని చెప్పారు. చాలామంది 108 అంబులెన్సుకు ఫోన్ చేసి అదే వాహనంలో ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్సలు చేయించుకున్నామని తెలిపారు. కొం దరు కాల్‌సెంటర్ ద్వారా వివరాలు తెలుసుకున్నామని, ఇది చాలా ఉపయోగపడిందని చెప్పా రు. తమకు మందులు, రవాణా చార్జీలు కూడా చెల్లించేవారని 2010కి ముందు ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు గుర్తు చేసుకున్నారు. హెల్త్ క్యాంపుల్లో రోగ నిర్ధారణ అనంతరం ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు పేద ప్రజలు పేర్కొన్నారు. శస్త్రచికిత్స అనంతరం ఇంటికి వెళ్లాక తమను పలకరిస్తూ అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సంతకంతో వచ్చిన లేఖ అంతులేని సంతోషం కలిగించినట్లు అత్యధికులు తెలిపారు.
పేదలను విపత్తు నుంచి కాపాడింది
‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెల్లరేషన్ కార్డుల జారీని బట్టి చూస్తే 90 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. వీరిలో చాలామంది క్లిష్టమైన జబ్బు బారిన పడితే నయం చేయించు కోలేని పరిస్థితిలో ఉన్నారు. పేద కుటుంబాలను సర్వనాశం చేయగల జబ్బుల (కెటస్ట్రోపిక్ ఇల్‌నెస్ డిసీజెస్) నుంచి ఆరోగ్యశ్రీ పథకం కాపాడింది’ అని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ పథకం అనతి కాలంలో ఇంత వేగంగా ప్రజల్లోకి వెళ్లడం అరుదుగా జరుగుతుందని నివేదికలో వెల్లడించారు.
ఆరోగ్యశ్రీపై ప్రపంచబ్యాంకు నివేదికలో మరికొన్ని అంశాలు...
* మొత్తం 86 శాతం మంది పేదవారిలో 71 శాతం మందికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి చేకూరింది.
* కోట్లాదిమంది జనాభా ఉన్న రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ కిందకు 938 జబ్బులను తెచ్చి సేవలందించడం విశేషం.
* హెల్త్‌క్యాంపులు, అవగాహనా కార్యక్రమాలతో పేదలకు పథకాన్ని వేగంగా పరిచయం చేశారు.
* రోగులను ఇన్‌పేషెంట్లుగా చేర్చుకునే ప్రక్రియలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పకడ్బందీగా వ్యవహరించింది. కేవలం 12 గంటల్లోనే అనుమతులు మంజూరు చేసే పద్ధతిని ఆ ట్రస్టు అమలు చేసింది.
* మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో రోగులకు ఆరోగ్యశ్రీ అందుబాటులోకి వచ్చాక వైద్య ఖర్చుల భారం గణనీయంగా తగ్గింది.
* ఆరోగ్యశ్రీ పథకానికి 108 అంబులెన్సు సర్వీసులు ఎంతో దోహదపడ్డాయి. 104 (సంచార వైద్యశాల), కాల్‌సెంటర్ కూడా ఉపయోగపడింది.
* చాలా రాష్ట్రాల్లో 50 శాతం వైద్య ఖర్చులు వసూలు చేస్తున్నారు. కానీ ఈ పథకం కింద వందశాతం భారం ప్రభుత్వమే భరించింది.
* ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ అమల్లోకి వచ్చాక చాలా రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఆసక్తి కనబరిచాయి.
* ఆరోగ్యశ్రీ పథకం ఒక విధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం పొందింది.