సాక్షి, గుంటూరు : ఏ మారుమూల పేదోడి గొంతులో కాస్తంత దగ్గు వినబడినా వైఎస్ చలించిపోయారు. ఏ వీధిన బడుగుల గుండెకు బాధ కలిగినా నేనున్నానంటూ ధైర్యమిచ్చారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఇంటా వైద్యుడిలా మారారు. అందుకే ఆయన చిరకాలం పేదల గుండెల్లో నిలిచిపోయారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లుగా ఆరోగ్యశ్రీ పేరు మార్చి.. పథకాన్ని నీరు గార్చింది. కనీసం కాలు ఆపరేషన్లకు కూడా ఉచిత వైద్యాన్ని అందించలేక అభాగ్యులకు ఆవేదనలు మిగిల్చింది.
జిల్లాలో ఎనిమిది నెలలపాటు ఎన్‌టీఆర్ వైద్యసేవ బిల్లులు ఆపేసి.. పథకం సేవలకు మంగళం పాడింది. ఈ నేపథ్యంలో ప్రజా సంకల్పయాత్రికుడై ప్రతి గుండె వేదనను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలకించారు. రూ.1000 దాటిన ఎలాంటి వైద్యానికైనా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని ప్రకటించారు. జగన్ ప్రకటనపై ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చారు. దీని ద్వారా 938 జబ్బులకు వైద్యం అందిస్తామని చెప్పినప్పటికీ కార్పొరేట్ ఆసుపత్రిలో 130 వ్యాధులకు మించి అమలు లేదు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ఆపరేషన్‌లు, వైద్య సేవలు అందించినందుకు ప్రైవేటు ఆస్పత్రులకు ఎనిమిది నెలలకుపైగా ప్రభుత్వం నిధులు చెల్లించలేదు. దీంతో పలు మార్లు లిఖిత పూర్వకంగా ఆస్పత్రుల నిర్వాహకులు ప్రభుత్వానికి హెచ్చరికలు చేసినా పట్టించుకోలేదు.
దీంతో 2019 జనవరిలో ఐదు రోజులపాటు వైద్య సేవలు నిలిపేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేశారు. నిధులు విడుదల చేస్తామంటూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. కానీ ఆస్పత్రుల నిర్వాహకుల అకౌంట్‌లోకి జమ కాలేదు. మరో దఫా సమ్మె చేసేందుకు ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల్లో భాగంగా ఆరోగ్యశ్రీ పథకం ప్రకటించారు. దీంతో ప్రజల్లో కోటి ఆశలు రేకెత్తాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యం అందుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.
ఇవీ జగన్ వరాలు
∙వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు
∙ఎన్ని లక్షలు ఖర్చయినా ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచితం
∙ఎక్కడ చికిత్స చేయించుకున్నా (హైదరాబాద్, బెంగళూరు, చెన్నై) ఆరోగ్యశ్రీ వర్తింపు
∙అన్ని రకాల వ్యాధులు, ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పరిధిలోకి..
∙వైద్యం తర్వాత ఆ కుటుంబం బతకడానికి ఆర్థికసాయం
∙కిడ్నీ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేలు పింఛన్ అందజేత
బతకాలని ఉంది
నా పేరు నక్కా ఏడుకొండలు. బాపట్ల మండలంలోని ఉప్పరపాలెం ఆరో మైలు స్వగ్రామం. నాకు భార్య, ఇద్దరు పిల్లలు. ఒక కుమార్తెకు వివాహం చేశాను. లారీ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. రెండు సంవత్సరాల క్రితం ప్రతి రోజూ అయాసం, దగ్గు వస్తుండటంతో వైద్యశాలకు వెళ్లాను. ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరిందని చెప్పారు. నేను లారీ తోలితేనే కుటుంబం గడిచేది. ఓ వైపు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ లారీకు వెళ్లేవాడిని.
ఏడు నెలల క్రితం తట్టుకోలేనంత దగ్గు, ఆయాసం రావడంతో ప్రైవేటు వైద్యశాల్లో చూపించా. రూ.70 వేలు ఖర్చయింది. అయినప్పటీ తగ్గలేదు. ప్రస్తుతం ఊపిరితిత్తులకు ఆపరేషన్ చేయాలంటున్నారు. దీనికి రూ.1.50 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. గుంటూరులోని పెద్ద ఆస్పత్రులకు వెళితే ‘ఉచితంగా చేయబోమన్నారు. చేసేదేమీలేక బాపట్ల ఏరియా వైద్యశాలలో టీబీ మందులు తీసుకొని మింగుతున్నా. 20 రోజుల క్రితం రాత్రి విపరీతమైన దగ్గు, ఆయాసం వచ్చి ఊపిరి కూడా తీసుకోలేకపోయాను. నా శరీరం చచ్చుపడుతుంటే.. నా కుటుంబ పరిస్థితి గుర్తొచ్చి ఊపిరి ఆగిపోయినంత పనయ్యేది. దేవుడా.. నా పిల్లల కోసమైనా నన్ను బతికించు అని ఎన్నోసార్లు వెక్కివెక్కి ఏడ్చాను. కొడుకు పెళ్లి చేయలేదు. కనీసం ఆ శుభకార్యం చేసేంత వరకైనా బతకాలని ఉంది.
– బాపట్ల టౌన్
కుటుంబానికి జీవం పోశారు
మాది కాకుమాను గ్రామం. నా పేరు షేక్ అక్బర్. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను. రెక్కాడితేగానీ డొక్క నిండని బతుకులు మావి. పూరిగుడిసెలో జీవిస్తూ, నేనూ నా భార్య నిత్యం కూలి పనులకు వెళతాం. మేము పడే కష్టాలు మా పిల్లలు పడకూడదనుకున్నాం. నా ఇద్దరు పిల్లల్ని ఉన్నతంగా చదివించాలనుకున్నాం. ఇంతలో నా ఆరోగ్యం పూర్తిగా పాడయ్యింది. ఒక రోజు వంట్లో బాగోలేదని చెప్పడంతో నా భార్య కరీమూన్ నన్ను ఆస్పత్రికి తీసుకువెళ్లింది.
అక్కడ పరీక్షలన్నీ చేసి నాకు కిడ్నీలు చెడిపోయాయని చెప్పారు. మానసికంగా పూర్తిగా కుంగిపోయాను. పనులకు కూడా వెళ్లలేని దైన్యస్థితికి చేరాను. కుటుంబం గడవటం కష్టంగా మారింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో పిల్లలు చదువు మాన్పించి వారిని కూడా కూలి పనులకు తీసుకెళ్లింది వాళ్ల అమ్మ. కొడుకు సిమెంటు పనులకు వెళితే.. కూతురు మాత్రం తల్లితోపాటే వ్యవసాయ కూలి పనులు చేస్తోంది.
కానీ నేనైతే బతికానంటే అది కచ్చితంగా వైఎస్‌ఆర్ దయే అనే చెబుతాను. నాకున్న పరిస్థితికి, అనారోగ్య సమస్యకు పెద్దాసుపత్రి మెట్లు ఎక్కే ధైర్యం కూడా లేదు. కానీ ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 2013లో కిడ్నీల ఆపరేషన్ చేశారు. మళ్లీ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను.
–కాకుమాను
ఆ మహానుభావుడి దయతోనే తిరగగలుగుతున్నా
నాపేరు షేక్ హుస్సేన్ సాహెబ్. స్వగ్రామం తాళ్లచెరువు. వృతి టైలరింగ్. 2008లో నాకు గుండెపోటు వచ్చింది. ఆపరేషన్ చేయాలంటే చాలా ఖర్చవుతుందని చెప్పారు. అంత డబ్బులేదు. అందరూ బతకవన్నారు. నేను కూడా బతుకుపై ఆశలు వదులుకున్నా. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ గురించి మా వాళ్లు చెప్పారు.
వెంటనే గుంటూరులో లలితా సూపర్ స్పెషాలిటీ వైద్యశాలకు వెళ్లా. ‘గుండె ఆపరేషన్ చేయాలి... ఆలస్యం చేయవద్దు వెంటనే ఆస్పత్రిలో చేరాల’న్నారు. డబ్బులు లేవని చెప్పా.. ‘డబ్బులేమీ అవసరం లేదు, ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేస్తామ’ని చెప్పారు. ఆపరేషన్ చేసి ఇప్పటికి 11 సంవత్సరాలైంది. ఆ మహానేత దయవల్ల నా భార్య, ముగ్గురు పిల్లలను పోషించుకోగలుగుతున్నా. మళ్లీ ఆయన కొడుకు జగన్ అలాంటి వైద్యం అందిస్తానని హామీ ఇవ్వడం సంతోషకరం.
– అచ్చంపేట
వైద్యానికి భరోసా ఇచ్చేవారు కావాలి
ఖరీదైన వైద్యం చేయించుకునే పరిస్థితులు లేక ఎందరో తనువు చాలిస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల మెట్లు ఎక్కేందుకు కూడా సాహసించడం లేదు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆరోగ్యశ్రీ పథకం.. వైఎస్ మరణానంతరం సక్రమంగా అమలు కావడం లేదు. మళ్లీ ఆయన తనయుడు వైఎస్ జగన్ అధికారంలోకి వస్తేనే పేదోడి వైద్యానికి భరోసా లభిస్తుంది.
– మోపర్తి శ్రీను, తిక్కిరెడ్డిపాలెం, ప్రత్తిపాడు మండలం
వైద్యం అందక కుమార్తె మృతి చెందింది
నా పేరు, కలిశెట్టి శేఖర్. నరసరావుపేట మండలంలోని అగ్రహారం స్వగ్రామం. నా కుమార్తె అక్కమ్మ నాలుగేళ్ల క్రితం యాసిడ్ తాగింది పేగులు కాలిపోయాయి. వైద్యశాలలో చేర్చగా శస్త్ర చికిత్స చేయాలన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ పరిధిలో ఆ ఆపరేషన్ లేదంట. సీఎం సహాయ నిధి కోసం స్పీకర్ కోడెలను ఆశ్రయించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆరు నెలల క్రితం తన తొమ్మిదేళ్ల బాలిక ప్రవల్లికను అనాథను చేసి వెళ్లిపోయింది. తెలుగుదేశం హయాంలో కొందరికి మాత్రమే పథకాలు అందాయి. వైఎస్‌ఆర్ మాదిరిగానే ఆరోగ్యశ్రీని అమలు చేయాలి.
– నరసరావుపేట టౌన్
Comments
Please login to add a commentAdd a comment