సాక్షి, అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ ఆలోచనతో మొదలై విశేష సేవలతో మన్నన పొందింది 108. తర్వాత దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో ప్రారంభానికి కారణమైంది. చంద్రబాబు వచ్చాక ఇక్కడ నిరాదరణకు గురవుతోంది. ఫోన్ చేసినా వాహనాలు ఘటనా స్థలికి రావు. టైర్లు అరిగిపోయి ఆగిపోయినవి కొన్ని, డీజిల్ లేక నిలుస్తున్నవి మరికొన్ని, ఇంజిన్ మరమ్మతులకు వచ్చి మూలనపడినవి ఇంకొన్ని. కొత్త వాహనాలంటూ అంబులెన్స్‌ల కొనుగోళ్లలోనూ భారీగా అవినీతికి పాల్పడ్డారు. వాహనాలకు నిధులు మంజూరు చేయకుండా, ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వకుండా చివరకు తప్పులను ప్రభుత్వం నిర్వహణ సంస్థలపై నెట్టేసింది.
డాష్ బోర్డులో మాయాజలం
రాష్ట్రంలో 108 వాహనాలు 459 ఉన్నాయి. వీటిలో 100కు పైగా నిలిచిపోయాయి. కానీ ముఖ్యమంత్రి కోర్ డాష్ బోర్డులో మాత్రం 98 శాతం వాహనాలు తిరుగుతున్నట్లు చూపిస్తున్నారు. ఈ లెక్కల ప్రకారమే బిల్లుల చెల్లింపు జరుగుతోంది. అంటే రోజుకు వందపైగా వాహనాలకు తిరగకున్నా బిల్లులు చెల్లిస్తున్నట్టు తేలింది. 108లో ఎంత మాయ జరుగుతుందో దీన్నిబట్టి తెలుసుకోవచ్చు.
ఉద్యోగుల కష్టాలు వర్ణనాతీతం
- 2018లో వేతనం రూ.4 వేలు పెంచుతున్నట్టు చెప్పారు. దీనిని మే నుంచి నాలుగు నెలలు ఇచ్చారు. 2018 సెప్టెంబరు నుంచి ఎగ్గొట్టారు.
- పీఎఫ్ సొమ్ములు జమ చేయడం లేదు.
- ఎక్కడ డ్రైవర్ లేకపోతే అక్కడకు పంపిస్తారు. అందుకు రిలీవింగ్ డబ్బు ఇవ్వడం లేదు.
- రెండు షిఫ్ట్‌లే ఉన్నందున ఉద్యోగి రోజూ 12 గంటలు చేయాల్సి వస్తోంది.
- 2019 జనవరి వేతనం ఫిబ్రవరి 25న ఇచ్చారు.
- జీవీకే నుంచి ఉద్యోగులకు బకాయిలు ఇప్పించడం లేదు.
- ఇటీవల ముగ్గురు ఉద్యోగులు మృతి చెందగా వారికి ఎలాంటి ప్రయోజనాలు ఇవ్వలేదు.
- ప్రశ్నిస్తే బెదిరించి ఉద్యోగం నుంచి తొలగించడం లేదా బదిలీ చేస్తున్నారు.
- వాహనాల్లో మందులు, కాటన్, బ్యాండేజీ వంటివేవీ లేవు. దీంతో రోగులు సిబ్బంది మీద విసుక్కుంటున్నారు.
ఈ ప్రాణాలను నిలిపేదెవరు?
- విజయవాడ నగర నడిబొడ్డు బెంజ్ సర్కిల్‌కు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది యనమలకుదురు. ఇటీవల ఇక్కడ ప్రమాదం జరిగి ఓ వ్యక్తి అక్కడి కక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 108కు ఫోన్ చేస్తే ఎంతకీ రాలేదు. దీంతో క్షతగాత్రులను ప్రైవేట్ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
- రాఘవయ్య పార్కు సమీపంలో వారం క్రితం మరో ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని తీసుకెళ్లేందుకు 108కు ఫోన్ చేస్తే అరగంట దాటినా అంబులెన్స్ రాలేదు. బాధితుడిని ప్రైవేట్ వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు.
రాజధాని నగరంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే... గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఇంకా ఎంత దారుణంగా ఉందో అంచనా వేయచ్చు. వాస్తవానికి అంబులెన్స్‌ల పరిస్థితి ఏమిటో అంచనా వేయలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది.
ఆపద్బంధుకు నిర్లక్ష్యపు జబ్బు
Published Fri, Mar 22 2019 7:33 AM | Last Updated on Fri, Mar 22 2019 7:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment