పేదల పాలిట అపర సంజీవనిగా పేరుగాంచిన ‘ఆరోగ్యశ్రీ’ పథకం తెలుగుదేశం ప్రభుత్వం రాకతో అనారోగ్యం బారినపడింది. ప్రస్తుతం దీని పేరు మార్చి ‘ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ’గా నామకరణం చేశారు. గతంలో ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్‌లు చేయించుకునే రోగులకు ఒక్క రోజులో అనుమతి వచ్చేది. ఇప్పుడు వారం నుంచి పది రోజులు కూడా పడుతోంది. అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్) వంటి పెద్దాసుపత్రి మొదలు పలు నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో సైతం ఆరోగ్య శ్రీ ఆపరేషన్లు నిలిపివేశారు.
సాక్షి, గుంటూరు/ మెడికల్: ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్‌లు జరగాలంటే రోజుల పాటు ఆసుపత్రుల్లో మూల గాల్సిన దుస్థితి ఏర్పడిందని రోగులు వాపోతున్నారు. ఆరోగ్యశ్రీ అనుమతులు రాకపోవడంతో రోగుల బంధువుల నుంచి తమకు తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరుగు తోందని, మరోవైపు ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుమతి ఇవ్వకుండా ఆపరేషన్‌లు చేస్తే దానికి ఆరోగ్యశ్రీ వర్తించదని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 2008 జూలై 7న ఈ పథకం ప్రారంభమైంది.
కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో ఈ పథకంలో మార్పులు జరిగాయి. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేస్తున్న 126 రకాల ఆపరేషన్లు ప్రైవేటు ఆస్పత్రుల నుంచి తొలగించి కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఏడాదికి రెండులక్షల రూపాయల వరకు ఖర్చుఅయ్యే వ్యాధులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం పొందే అవకాశం ఉంది. టీడీపీ ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్ 2న ఎన్‌టీఆర్ ఆరోగ్యశ్రీగా పేరు మార్చి, అనుమతుల మంజూరులో కోతలు విధించింది.
అనుమతుల్లో ఆలస్యం...
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుమతులు ఇవ్వడంలో ఆలస్యం చేస్తుండటంతో పలు ఆస్పత్రుల్లో ఆపరేషన్ కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయి.
కొన్ని ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేసినా వాటికి రావాల్సిన పారితోషికాలు విడుదల చేయకపోవడంతో ఆరోగ్య శ్రీ ఆపరేషన్లు చేసేందుకు వైద్యులు ఆసక్తిచూపించటం లేదు.
జీజీహెచ్‌లో గతంలో నెలకు రూ.కోటికిపైగా పారితోషికాల రూపంలో ఆస్పత్రికి వచ్చే ఆదాయం నేడు కేవలం రూ.19లక్షలకు పడిపోయిందంటే అనుమతులు ఇవ్వడంలో ప్రభుత్వం ఏ మేరకు జాప్యం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.
2014 జూన్‌లో ఆరోగ్యశ్రీ కింద జీజీహెచ్‌లో 854 ఆపరేషన్లు చేయగా, 494 ఆపరేషన్లుకు మాత్రమే రూ.10,976,816 లు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిధులను చెల్లించింది.
జూలైలో 940 ఆపరేషన్లు చేస్తే 888 ఆపరేషన్లుకు రూ. 18,033,082లు చెల్లించింది.
ఆగస్టు నెలలో 947 ఆపరేషన్లు చేయగా 115 ఆపరేషన్లుకు మాత్రమే రూ.19,92,891లు చెల్లించింది.
సెప్టెంబర్‌లో 886 ఆపరేషన్లు చేయగా 648 ఆపరేషన్లుకు రూ.12,684,428 చెల్లించింది.
ఆగస్టు నెలలో జీజీహెచ్‌లోని కార్డియాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ విభాగాల్లో చికిత్స పొందిన రోగుల్లో ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వం క్లెయిమ్ చెల్లించలేదు. న్యూరో సర్జరీ విభాగంలో ఐదుగురికి, ఆర్థోపెడిక్ విభాగంలో ఏడుగురికి, జనరల్ సర్జరీ విభాగంలో 11 మందికి మాత్రమే పారితోషికాలు చెల్లించింది.
ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుండడంతో జీజీహెచ్‌లోని కొన్ని వైద్య విభాగాల్లో, జిల్లాలోని పలు నెట్ వర్క్ ఆస్పత్రుల్లో వైద్యసేవలను నిలిపివేస్తున్నారు.
మన బిడ్డలకు ఇలా జరిగితే ఊరుకుంటామా...
తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రులకు వచ్చే నిరుపేదలకు వెంటనే ఆపరేషన్‌లు చేయాలంటే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి అనుమతులు రావడం ఆలస్యమౌతుంది. దీని వల్ల రోగులు, వారి బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులు దృష్టిసారించి సమస్యను సత్వరమే పరిష్కరించాలి. ఇదే మన ఇంటిలో బిడ్డలకు ఇలా జరిగితే ఊరుకుంటామా, పేదవారికి ఉపయో గపడినప్పుడే ఈ పథకానికి సార్థకత ఉంటుంది.
ఆలస్యం అవుతున్న మాట వాస్తవమే...
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్లు చేసేందుకు గతంలో వెంటనే అనుమతి ఇచ్చేవారం. నేడు కొంత సమయం పడుతోంది. జిల్లాలో 32 నెట్‌వర్క్ ఆస్పత్రుల ద్వారా వైద్యసేవలు అందుతున్నాయి. వీటిల్లో ఐదు ప్రభుత్వ ఆస్పత్రులు కాగా 27 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి.
- డాక్టర్ కె.విజయభాస్కరరెడ్డి, ఆరోగ్యశ్రీ, జిల్లా కోఆర్డినేటర్
ఆరోగ్య శ్రీ ఆపరేషన్లు బంద్
Published Tue, Dec 2 2014 3:17 AM | Last Updated on Mon, Aug 20 2018 4:22 PM
Advertisement