స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం
- గుంటూరులోని పోలీస్ మైదానం ముస్తాబు
- ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి
గుంటూరు క్రైం : స్వాతంత్య్ర వేడుకలకు గుంటూరులోని పోలీస్ మైదానం ముస్తాబయింది. 68వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా వేడుకలకు రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్యఅతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి జరుగుతున్న ఈ వేడుకలను అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రాంగణాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. వేదికతోపాటు, పోలీస్ గౌరవ వందనం, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు, అతిథులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. వివిధ శాఖల ప్రాముఖ్యతను తెలియజేస్తూ నిర్మించిన శకటాలను మైదానంలో సిద్ధంగా ఉంచారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన అధికారులకు జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు.
వేడుకల్లో పాల్గొనే మంత్రులు, ఎమ్యెల్యేలు, కలెక్టర్,ఎస్పీలు, వీఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థానిక ప్రజలు, విద్యార్థుల కోసం ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చే శారు. వీఐపీల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు.ఏర్పాట్లను అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్ స్వయంగా పర్యవేక్షించారు. ఆయన వెంట ఏఆర్ డీఎస్పీ బి.సత్యనారాయణ, తహశీల్దారు టి. మోహన్‌రావు వున్నారు.