భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 10, 11 తేదీల్లో తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం వేడుకలు సాఫీగా సాగేనా...? గత వైఫల్యాలను ఈసారయినా అధికారులు అధిగమిస్తారా...? భక్తుల్లో వ్యక్తమవుతున్న సందేహాలివి. ఈ వేడుకలకు దాదాపు 50వేల మందికి పైగా భక్తులు రావచ్చని అంచనా. వీరందరికీ సకల సౌకర్యాలు కల్పిస్తామంటూ అధికారులు గుప్పిస్తున్న ప్రకటనలను.. గతానుభవాల దృష్ట్యా భక్తులు నమ్మడం లేదు. కొందరు అధికారుల నిర్లక్ష్యం, ఉత్సవాలపై రెవెన్యూ పెత్తనం కారణంగా భక్తులు ఇబ్బందులపాలవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ముక్కోటి ఏకాదశి ఉత్సవాలపై కలెక్టర్ శ్రీనివాస శ్రీ నరేష్ గురువారం జిల్లాస్థాయి అధికారులతో సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో.. గతంలో జరిగిన లోపాలను ఓసారి పరిశీలిద్దాం.
ఉత్సవాలకు ఏర్పాట్లు చేయటంలో ప్రతిసారి ఆలస్యమవుతూనే ఉంది. తెప్పోత్సవం వరకు కూడా సౌకర్యాల పేరిట పనులు చేస్తుండటంతో నిధులు ఖర్చవుతున్నాయి తప్పితే భక్తులకు ఇబ్బందులు తొలగటం లేదు.
ఉత్సవాలకు వచ్చే సామాన్య భక్తులకు టిక్కెట్లు దొరకటం లేదు. దీని కోసం ఉత్సవం రోజు సాయంత్రం వరకు కూడా సబ్ కలెక్టరేట్‌లో భక్తులు పడిగాపులు కాస్తుండటం పరిపాటిగా మారింది. గత ఏడాది సబ్ కలెక్టర్ భరత్ గుప్తా మూడు రోజుల ముందే వీటి విక్రయాలను ముగిస్తామని చెప్పారు. కానీ ఆచరణలో విఫలమయ్యారు.
ఉత్తర ద్వార దర్శనం టిక్కెట్లను సామాన్యులకు అందుబాటులో ఉంచటం లేదు. టిక్కెట్లను వీఐపీల పేరుతో ప్రజాప్రతినిధులు, వారి సిఫార్సులతో వచ్చే రాజకీయ పార్టీల నాయకులు తీసుకుంటున్నారు. గత ఏడాది వీఐపీ టిక్కెట్లు 600కుగాను ఎంపీ పేరిట 41, మంత్రి రాంరెడ్డి పేరిట 40, ఎమ్మెల్యే సత్యవతి పేరిట 29, ఇతర ప్రజాప్రతినిధులు, ట్రస్టు బోర్డ్ సభ్యులకు దాదాపు టిక్కెట్లన్నీ అప్పగించారు.
దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు భద్రాచలంలో వసతి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. దేవస్థానం ఆధీనంలోని గదులతోపాటు పట్టణంలోని ప్రైవేటు లాడ్జీలన్నిటిని రెవెన్యూ అధికారులు స్వాధీనపర్చుకుని వీఐపీలకు కేటాయిస్తున్నారు. ఫలితంగా సామాన్య భక్తులకు గదులు దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. దేవస్థానం ఆధ్వర్యంలో 356 గదులు ఉన్నాయి. వీటిలో గత ఏడాది.. పోలీసులకు-87, డీపీఆర్‌ఓ పేరిట-36, స్థానిక ఎమ్మెల్యే పేరిట-10, ఎంపీ పేరిట బోగాల శ్రీనివాసరెడ్డి అనే కాంగ్రెస్ పార్టీ నాయకుడికి-4 కే టాయించారు.
ముక్కోటి ఉత్సవాలను కవరేజీకిగాను మీడియా పాసులు జారీ చేస్తున్నప్పటికీ వారికి కేటాయించిన గ్యాలరీలో ఇతరులు కూర్చుంటున్నారు. మీడియా పాసులు కూడా పబ్లిసిటీ విభాగం అధికారులు ఇస్టానుసారంగా కేటాయిస్తున్నారు.
ఏడాదికోమారు జరిగే తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనాన్ని తిలకిచేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అధికారులు మాత్రం హడావిడిగా.. మొక్కుబడి తంతుగా ముగించేస్తున్నారు.
ఉత్తర ద్వార దర్శనం అనంతరం అదే ద్వారం గుండా స్వామి వారి మూలవరుల దర్శనం కోసం భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఈ లైన్లలో పోలీసులు, వారి కుటుంబాలే ముందు వరుసలో కనిపిస్తున్నారు.
స్వామి వారి ప్రసాదాల కోసం ప్రతిసారీ భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తగినన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నప్పటికీ వాటిని భక్తులు తెలుసుకునేలా తగిన ప్రచారం చేయటంలో అధికారులు విఫలమవుతున్నారు.
ఉత్సవాల పేరిట ఆయా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను సరిగా పరిశీలించకుండా బిల్లులు చెల్లిస్తున్నారు.
వైఫల్యాలు అధిగమించేనా...!
Published Thu, Dec 19 2013 6:20 AM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM
Advertisement