కంచికచర్ల : పగటిపూట ఆటోమొబైల్ మెకానిక్‌లా జీవనం సాగిస్తూ రెక్కీలు నిర్వహించి, రాత్రివేళల్లో దొంతనాలు చేస్తున్న వ్యక్తిని కంచికచర్ల పోలీసులతోపాటు నందిగామ ఐడీ పార్టీకి చెందిన సిబ్బంది మంగళవారం పట్టుకున్నారు. అతడినుంచి రూ.5 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ టి.రాధేష్ మురళీ ఈ వివరాలు తెలియజేశారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం.. విజయవాడ జక్కంపూడి కాలనీకి చెందిన బత్తుల కిరణ్(27) కొంతకాలంగా నందిగామలోని ఓ మోటార్‌సైకిళ్ల షోరూంలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు.
మంగళవారం స్థానిక వ్యవసాయశాఖ మార్కెట్ యార్డు సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న అతడిని పోలీసులు పట్టుకున్నారు. అతడు పలుచోట్ల దొంగతనాలు చేసినట్లు విచారణలో తేలింది. కంచికచర్లలోని పెద్ద బజార్‌లో ఈ ఏడాది మార్చి నెలలో శ్రీ రామచంద్రమూర్తి అనే ఉపాధ్యాయుడి ఇంటిలో, హనుమాన్‌పేట, గొట్టుముక్కల రోడ్డులోని పెద్దబజార్‌లో, నందిగామ పోలీస్‌స్టేషన్ పరిధిలో 10 చోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడని తేలింది. కిరణ్‌పై గతంలో ప్రకాశం జిల్లా అద్దంకి, విజయవాడ, గుంటూరు, ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి అరెస్టయ్యాడు.
ఈమేరకు అతడినుంచి రూ.5 లక్షలు విలువచేసే 150 గ్రాముల బంగారం(నాలుగు బంగారు గొలుసులు, ఎనిమిది జతల చెవి జూకాలు, 9 ఉంగరాలు) రెండున్నర కేజీల వెండి(గిన్నెలు, ప్లేట్లు, గ్లాసులు, కుంకుమ భరిణెలు), రెండు సెల్‌ఫోన్లు, ఐ ప్యాడ్‌లను స్వాధీనం చేసుకున్నారు. నందిగామ రూరల్ సీఐ వై.సత్యకిషోర్ అందించిన సమాచారం మేరకు తన పర్యవేక్షణలో స్థానిక ఎస్‌ఐ కె. ఈశ్వరరావు ఆధ్వర్యంలో కిరణ్‌ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఇళ్ల యజమానులు తమ వస్తువులు పోయిన వెంటనే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలని డీఎస్పీ కోరారు. ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. గిల్టు వస్తువులు పోతే యజమానులు బంగారు వస్తువులు పోయాయని తప్పుడు సమాచారం అందించటం సరైన విధానం కాదని తెలిపారు.
కంచికచర్ల, నందిగామ ప్రాంతాల్లో అంతర్రాష్ట్ర దొంగలు
కంచికచర్ల, నందిగామ పరిసర ప్రాంతాల్లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా తిరుగుతోందని తమకు సమాచారం అందినట్లు డీఎస్పీ రాధేష్ మురళి తెలిపారు. బ్యాంకులు, సబ్ రిజిస్టార్ కార్యాలయాల వద్ద సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రాజధాని సమీపంలో ఈ ప్రాంతాలు ఉండటంతో భూముల ధరలు విపరీతంగా పెరిగాయని, వాటి కొనుగోలు అమ్మకాలు జరిపే వారు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. కొత్త వ్యక్తులు సంచరిస్తే తమ సిబ్బందికి తెలియజేయాలని అన్నారు.
సిబ్బందికి నగదు పారితోషికం
కిరణ్‌ను పట్టుకున్నందుకు నందిగామ డీఎస్పీ రాధేష్‌మురళీ కంచికచర్ల ఎస్‌ఐ ఈశ్వరరావుకు, ఐడీ పార్టీ ఏఎస్‌ఐ రామారావు, హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, కానిస్టేబుళ్లు సురేష్, నరేంద్రలకు నగదు రివార్డులు అందజేశారు.
పగలు బైక్ మెకానిక్.. రాత్రిళ్లు చోరీలు
Published Thu, Jun 25 2015 4:40 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement