కళ తప్పిన కళావేదికలు
* రూ.కోట్లలో తుపాను నష్టం
* సాంస్కృతిక రంగానికి తీరని వేదన
విశాఖపట్నం-కల్చరల్: సాంస్కృతిక రాజధానికిగా వెలుగొందుతున్న విశాఖపట్నం హుదూద్ తుపాను ప్రభావంతో మూగబోయింది. సాంస్కృతిక వేదికలు, ఆడిటోరియంలు కళావిహీనంగా మారాయి. తుపాను తాకిడికి వేదికలన్నీ శిథిలమైపోయాయి. కొన్ని పూర్తిగాను, మరికొన్ని పాక్షికంగా పాడవ్వడంతో కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లింది. దీంతో ఇప్పట్లో తేరుకోలేని పరిస్థితి ఏర్పడింది.
శిల్పారామానికి భారీ నష్టం
గ్రామీణ కళలను, సంస్కృతిని ప్రతిబింబించే శిల్పారామం (జాతర) కళ తప్పింది. 25 ఎకరాల వనంలో పచ్చదనం మాయమైంది. కొన్ని శిల్పాలు శిథిలమయ్యాయి. లోపల ఉన్న ఆరుబయట హాఫీ కళావేదికలు దెబ్బతిన్నాయి. ఇటీవల నిర్మించిన ఫంక్షన్ హాల్, 18 స్టాల్స్, ఫైబర్ శిల్పాలు దెబ్బతిన్నాయి. నూతనంగా నిర్మించిన చిల్డ్రన్స్ పార్కు పూర్తిగా ధ్వంసమైంది. రూ.1.12 కోట్ల నష్టం వాటిల్లిందని ఏపీ టూరిజం సంస్థ అంచనా వేసింది.
దెబ్బతిన్న వైశాఖి జల ఉద్యానవనం
విశాఖకు వన్నె తెచ్చే కళావేదికల్లో వైశాఖి జల ఉద్యానవనం ఒకటి. ఇది నగరంలో అన్ని తరగతుల వారికి ఆహ్లాదాన్ని అందించే వేదిక. అలాంటి వేదిక అందాలను హుదూద్ తుపాను కబళించింది. ఎస్‌ఎస్ ఫంక్షన్‌హాల్, ఏపీల్ గ్రౌండ్, మలేసియా టెంట్, గ్రీనరీ, బేంబో గార్డెన్స్, ప్లే ఎక్విప్‌మెంట్స్, కళావేదిక, పార్కు, లైటింగ్ సిస్టమ్ మొత్తం 80 శాతం దెబ్బతిన్నాయి. వెదురు వనంతో తయారు చేసిన ద్వారం పూర్తిగా ధ్వంసమైంది. దీని నష్టం రూ.50 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు.
కళాభారతికి పాక్షిక నష్టం
నిత్యం కళాకారులతో కిటకిటలాడే విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడెమీ (వీఎండీఏ) ఆడిటోరియం కళాభారతి కళతప్పింది. తుపాను ప్రభావానికి ప్రహరీ గోడ ధ్వంసమైంది. ఆడిటోరియం పైన వాల్ రేకులు, కిటికీల గ్లాస్‌లు, గ్యాలరీలో ఉన్న ప్రముఖుల చిత్రాలు, బాత్‌రూమ్స్ డోర్స్ ధ్వంసమయ్యాయి. సుమారు రూ.8 లక్షలు నష్టం వాటిల్లిందని వీఎండీఏ కార్యదర్శి జి.ఆర్.కె. రాంబాబు తెలిపారు.
గురజాడ కళాక్షేత్రానికి తుపాను తాకిడి
గురజాడ కళాక్షేత్రం కూడా తుపాను తాకిడికి గురయ్యింది. కళావేదిక ఎదురుగా ఉన్న ఓపెన్ ఆడిటోరియం రే కులన్నీ శిథిలమై అస్తవ్యస్తంగా మారింది. వే దికలోపల తెరలు చిరిగిపోయి అందహీనం గా కన్పిస్తున్నాయి. ప్రస్తుతం మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఐదు లక్షల వరకు నష్టం వాటిల్లిందని వుడా అధికారులు అంచనా వేశారు.