హుజూర్‌నగర్, న్యూస్‌లైన్: సీమాంధ్రలో ఏపీఎన్జీఓలు చేస్తున్న సమైక్య ఉద్యమం ఫలితంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎన్‌ఎస్‌పీ ఉద్యోగులకు వేతనాలు అందడం లేదు. గడచిన నెల వేతనం రాలేదు. ఇక.. ఈ నెల కూడా వచ్చే సూచనలు కన్పించడం లేదు. దీంతో 120మంది ఉద్యోగులు ఆందోళన చెందు తున్నారు.
నాగార్జునసాగర్ ఎడమకాలువ పరిధిలోని జగ్గయ్యపేట డివిజన్ కింద హుజూర్‌నగర్, కోదాడ, నందిగామ, జగ్గయ్యపేట సబ్‌డివిజన్లు ఉన్నాయి. హుజూర్‌నగర్, కోదాడ సబ్‌డివిజన్లు తెలంగాణ ప్రాంతానికి చెందినవి కావడం అలాగే జగ్గయ్యపేట, నందిగామలు ఆంధ్రాప్రాంతం పరిధిలో ఉన్నాయి. నిబంధనల ప్రకారం హుజూర్‌నగర్, కోదాడ సబ్‌డివిజన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతన చెల్లింపులు ఆంధ్రాప్రాంతమైన జగ్గయ్యపేట డివిజన్ నుంచే జరుగుతున్నాయి. ఈ క్రమంలో సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం వల్ల ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయడం లేదు.
ఈ రెండు సబ్‌డివిజన్ల పరిధిలో పనిచేస్తున్న సుమారు 120 మంది ఉద్యోగులకు ఆగస్టు వేతనం అందలేదు. కనీసం సెప్టెంబర్ నెల వేతనమైనా అందుతుందో లేదోనని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. కానీ సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే వేతనాలు అందే పరిస్థితి కనపడడం లేదు. దీంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు డివిజన్ల పరిధిలోని ఎన్‌ఎస్‌పీ ఉద్యోగులైన లస్కర్లు, ఎన్‌ఎంఆర్‌లు, అటెండర్లు, ఇంజనీర్లకు ప్రతినెలా సుమారు రూ.15 లక్షలు వేతనాల కింద అందజేస్తున్నారు. దసరా, బక్రీద్ వంటి పర్వదినాల్లో కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిత్యం విధులకు హాజరవుతున్నా వేతనాలు అందకపోవడంతో కుటుం బాలు గడవడం కష్టంగా మారుతోందని ఉద్యోగులు వాపోతున్నారు. ముఖ్యంగా లస్కర్లు, ఇంజనీర్లు రోజూ ఎన్‌ఎస్‌పీ కాలువలపై పర్యవేక్షణ చేసేందుకు విధి నిర్వహణలో భాగంగా ద్విచక్రవాహనాలపై ప్రయాణించాల్సి ఉంటున్నందున కనీసం పెట్రోల్ కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగులు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే వేతనాలు అందజేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.