సాక్షి, కడప : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలే సారధులై సమైక్య ఉద్యమాన్ని ఊరూరా పరవళ్లు తొక్కిస్తున్నారు. ఉద్యోగులు, విద్యార్థులతోపాటు అన్ని వర్గాల ప్రజలు ఊతమిస్తుండటంతో ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. ఏపీ ఎన్జీఓల పిలుపుమేరకు జిల్లావ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను పూర్తిగా మూసి వేయించారు. దీంతోపాటు వినూత్న నిరసనలు, ర్యాలీలు, మానవహారాలతో హోరెత్తించారు. ఎర్రగుంట్లలో వేలాది మందితో రణభేరి సభను నిర్వహించారు.
కడప నగరంలో ఉపాధ్యాయులు, ఎన్జీఓలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, బ్యాంకులను మూసి వేయించారు. వృత్తి విద్య కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించి గడ్డి తింటూ నిరసన తెలిపారు. బిల్డర్స్ అండ్ పెయింటర్స్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సోనియా, కేసీఆర్‌ల శవపేటికలను చెక్కపెట్టెలతో రూపొందించి ఏడురోడ్ల కూడలిలో దహనం చేశారు.
విద్యుత్ కార్మికులు పట్టణంలో బెలూన్లతో నిరసన తెలిపారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో మంత్రి రామచంద్రయ్య ఇంటిని ముట్టడించారు. ఇంటికి పూలు, గాజులు, పసుపు, కుంకుమ తగిలించి నిరసన తెలిపారు. స్టేట్ గెస్ట్‌హౌస్‌లో నాన్ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు, ఏజేసీ సుదర్శన్‌రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించి కార్యచరణ రూపొందించారు. 28న ఎనిమిది వేల మంది సర్పంచులు, వార్డు సభ్యులతో రిలే దీక్షలుచేపట్టాలని నిర్ణయించారు. వైఎస్సార్ సీపీ నేత అంజాద్‌బాష నేతృత్వంలో రోజా పూలతో నిరసన తెలిపారు.
జమ్మలమడుగులో వివేకానంద జూనియర్ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. ఆర్టీసీ కార్మికుల రిలే దీక్షలు కొనసాగాయి. ఎర్రగుంట్లలో పూర్వ విద్యార్థులు ముద్దనూరు రోడ్డునుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు రణభేరి సభ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. 1500 అడుగుల జాతీయ జెండాతో విజయవాణి హైస్కూలు విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. వంగపండు ఉష ఆటాపాట ఆకట్టుకుంది. వీరికి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి, ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి సంఘీభావం తెలిపి ప్రసంగించారు.
రాజంపేట పట్టణంలో జేఏసీ కన్వీనర్ ఎస్వీ రమణ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను మూసి వేయించారు. వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో మందపల్లె గ్రామస్తులు 40 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
రైల్వేకోడూరు పట్టణంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వీరికి ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, డీసీసీబీ మాజీ చైర్మన్ కొల్లం బ్రహ్మనందరెడ్డి సంఘీభావం తెలిపారు. ఆదర్శ పాఠశాల విద్యార్థులు తెలుగుతల్లి, దేశ నాయకుల వేషధారణలో ఆకట్టుకున్నారు.
పులివెందులలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించి పూల అంగళ్ల కూడలిలో ప్రార్థనలు చేశారు. వీరికి వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, నేతలు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ఎన్జీఓలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. ఉపాధ్యాయులు భారీ ర్యాలీ చేపట్టారు.
రాయచోటిలో టైలర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో 300 అడుగుల జాతీయజెండాతో పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. న్యాయవాదులు, జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. ఆర్టీసీ ఉద్యోగులు బెలూన్లతో ర్యాలీని నిర్వహించారు.
కమలాపురం పట్టణంలో వైఎస్సార్ సీపీ నేత సంబటూరు ప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో ఎస్‌బీఐ, ఏపీజీబీ బ్యాంకులను మూసి వేయించారు.
మైదుకూరులో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో పెద్ద ఎత్తున బెలూన్లతో ర్యాలీ చేపట్టారు. 50 సంఖ్య ఆకారంలో విద్యార్థులు నిలబడి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. మహిళా ఉద్యోగులు 50 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
బద్వేలులో రజకులు వినూత్నంగా గాడిదలకు సోనియా, కేసీఆర్ మాస్క్‌లను ధరింపజేసి ఊరేగించారు. అరవింద పాఠశాల విద్యార్థులు సాయి వ్రతాన్ని నిర్వహించారు. ప్రైవేటు విద్యా సంస్థల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు.పోరుమామిళ్ల పట్టణంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అక్కుల్‌రెడ్డిపల్లె గ్రామస్తులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు మోకాళ్లపై మానవహారంగా నిలబడి నిరసన వ్యక్తంచేశారు.
ప్రొద్దుటూరులో ఏపీ ఎన్జీఓల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూసి వేయించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో పుట్టపర్తి కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు.
అదే హోరు
Published Fri, Sep 20 2013 2:18 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement