- అవకాశాలపై నివేదిక కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఓ సముదాయంగా నిర్మించే అంశాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీవ్రంగా పరిశీలిస్తున్నారు. ఆయన శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో దీనిపై సమీక్ష జరిపారు. జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్లలో ఎన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి.? వాటి కున్న స్థలం ఎంత.? భవన సముదాయాల నిర్మాణం కోసం ఎంత స్థలం కావాలి వంటి అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆ సముదాయాల్లో కలెక్టర్ కార్యాలయం, క్యాంపు కార్యాలయం అత్యంత ఆధునికంగా ఉండేలా డిజైన్ చేయాలని సీఎం సూచించారు. కొన్ని జిల్లాల్లో ఒక్కో కార్యాలయం ఒక్కో చోట ఉండడంతో జిల్లాలోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చే ప్రజలకు ఏది ఎక్కడుందో తెలియక అవస్థలు పడుతున్నందున వాటిని ఒకే చోట నిర్మిస్తే బావుంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు, మిగిలిన జిల్లా కార్యాలయాల్లో ఒక్కోటి ఒక్కో చోట ఉన్నాయి. ఇతర జిల్లా కేంద్రాల్లోనూ ఆఫీసులు సుదూరంగా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే సీఎం సముదాయాలుగా ఒకేచోట ఉంచేందుకు యత్నిస్తున్నారు.
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మంచినీటి సరఫరా..
హైదరాబాద్ నగర ప్రజల ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మంచినీటి సరఫరా ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.ఆయన సచివాలయంలో హైదరాబాద్ మహానగర మంచినీరు, మురుగునీటి పారుదల మండలి అధికారులతో నీటి సమస్యపై సమీక్షించారు. ప్రస్తుతం హైదరాబాద్‌కు తాగునీరు ఎంత కావాలి..? భవిష్యత్తులో ఎంత నీరు అవసరం అనే విషయాన్ని అధ్యయనం చేయాలని కోరారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి నగరానికి నీళ్లు మళ్లించుకునేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజలకు అవసరమైన మేరకు నీటిని సరఫరా చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని కూడా సీఎం పేర్కొన్నట్లు ఓ అధికారి తెలిపారు.