సూర్యగ్రహణం సందర్భంగా ఆలయాల మూత
సాక్షి, తిరుమల/ విజయవాడ/ సింహాచలం: సూర్యగ్రహణం సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రముఖ ఆలయాలను మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు మూసివేయనున్నారు. ఈ నెల 9న ఉదయం 5.47 నుంచి ఉదయం 9.08 గంటల మధ్య సూర్యగ్రహణం సంభవించనుంది. దీంతో తిరుమల శ్రీవారి ఆలయం, బెజవాడ కనకదుర్గమ్మ, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి తదితర ఆలయాల తలుపులు మూసివేయనున్నారు.
శుద్ధి, సంప్రోక్షణ అనంతరం తిరిగి తెరిచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. కాగా, తిరుమలలో బుధవారం నిర్వహించాల్సిన సహస్రకళశాభిషేకం సేవను రద్దు చేశారు. ఇతర సేవల్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు. అలాగే సింహాచలం అప్పన్న ఆలయంలో బుధవారం నిత్యకల్యాణం రద్దు చేసినట్లు ఈవో కె.రామచంద్రమోహన్ తెలిపారు.