ఒంగోలులో నిరసన తెలుపుతున్న ఆశ కార్యకర్తలు
ఒక రోజు కూలికి పోయినా కనీసం రూ.200లు సంపాదిస్తారు. అంటే నెలకు రూ.6 వేలు. కానీ గ్రామాల్లో వైద్య సేవలకు సహాయకులుగా ఉండే ఆశ కార్యకర్తలకు మాత్రం కనీస వేతనాలు అమలు కావడం లేదు. ఎంత చేసినా నెలకు రూ.2 వేలకు మించని వేతనాలు. వీటితో ఎలా బతకాలి, కుటుంబాలను ఎలా పోషించుకోవాలి. తమకు కూడా కనీస వేతనాలు ఇవ్వాలని ఆశ కార్యకర్తలు ఎన్నో పోరాటాలు సాగిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు.
కారంచేడు : గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కరికీ పూర్తి స్థాయి ఆరోగ్య సేవలను అందించాలనే సంకల్పంతో 2006వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశ కార్యకర్తలను నియమించారు. వీరు గ్రామాల్లో ఉండే ఏఎన్‌ఎంలకు సహాయకులుగా ఉంటూ ప్రజలకు ఆరోగ్య సేవలు, సూచనలు అందిస్తుంటారు. అంతే కాకుండా గ్రామాల్లో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను గుర్తించి వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటుంటారు. ప్రభుత్వం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాలతో పాటు ప్రతి బుధ, శనివారాల్లో జరిగే ఇమ్యూనైజేషన్ కార్యక్రమాల్లోనూ సేవలందిస్తుంటారు. అయితే ఇటీవల పెరిగిన ఖర్చులు, నిత్యవసర వస్తువుల ధరలతో పోల్చుకుంటే సేవలకు తగిన ఫలితం అందడం లేదని, దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సేవలు ఫుల్..
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 వేల మంది ఆశ కార్యకర్తలు సేవలందిస్తున్నారు. జిల్లాలో 56 మండలాల్లో 2650 మంది నిత్యం ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు. అంతే కాకుండా ఏజెన్సీ, ఆరు ఐటీడీఏల పరిధిలో 5262 మంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ (ఏజెన్సీ ఆశాలు) పని చేస్తున్నారు. వీరంతా చిన్నారులు, గర్భిణులకు విశేష సేవలందిస్తూ భవిష్యత్తు మానవ వనరుల వికాసానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న ఆశలకు కనీస వేతన సదుపాయాలు కల్పించాలని పోరాటాలు చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర స్థాయిలో చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టారు. కనీస వేతనాలు, యూనిఫాం అలవెన్స్ వంటి డిమాండ్‌లతో ధర్నా చేపట్టారు. గ్రామాల్లో డీఈసీ మాత్రల పంపిణీ, పలు టీకా కార్యక్రమాల్లో ఏఎన్‌ఎంలకు అండగా ఉంటున్నారు. ఇన్ని సేవలు అందిస్తున్నా తమకు తగిన ప్రతిఫలం దక్కడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం పనికి తగిన వేతనమని కేవలం కంటి తుడుపుగా ఇచ్చే పారితోషంతో తమ కుటుంబాలు ఎలా గడుస్తాయని వారు ప్రశ్నిస్తున్నారు. వారు ఇచ్చే పారితోషికాలు సేవలందించేందుకు ప్రయాణ ఖర్చులకు కూడా సరిపోని విధంగా ఉంటున్నాయని ఆరోపిస్తున్నారు.
ఫలించని ధర్నాలు:
ఆశ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి కనీస వేతనాలు అందించాలని వివిధ సంఘాల సహకారంతో చేస్తున్న ధర్నాలతో అయినా ప్రభుత్వం వేతనాలు పెంచాల్సి ఉందని వారంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కనీస వేతనం రూ.5 వేలు అందించాలని వారు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.6 వేలకు పెంచారని, ఏపీలో కూడా వేతనాలు పెంచాలని కోరుతున్నారు.
ఆశల ప్రధాన డిమాండ్లివే..
సేవకు కొలత వేసి డబ్బులిచ్చే పద్ధతి తీసివేయాలి. తెలంగాణ మాదిరిగా వేతనాలు చెల్లించాలి.
మూడేళ్ల నుంచి ఇవ్వాల్సిన యూనిఫాం అలవెన్స్‌లతో పాటు బకాయిలు కూడా చెల్లించాలి.
104లో సేవలందించినందుకు గాను రోజుకు రూ.100ల వంతున ఇవ్వాల్సిన బకాయిలు కూడా వెంటనే ఇవ్వాలి.
టీబీ కేసుల రోగులకు సేవలందించినందుకు రెండు సంవత్సరాలుగా పేరుకుపోయిన బకాయిలు విడుదల చేయాలి.
ఆశ డే రోజున అందించే రూ.150లు బ్యాంక్‌లో కాకుండా చేతికివ్వాలి.- పాఠశాలల్లో పిల్లలకు మింగించే ఐరన్ ట్యాబ్‌లెట్లు వేసినందుకు, పెంటావాలెంట్, రోటా వ్యాక్సిన్‌లకు పారితోషికం ఇవ్వాలి.
పభుత్వం ఆదుకోవాలి:
ఆశ కార్యకర్తలకు కనీస వేతన చట్టం అమలు చేయాలి. వీరికి కనీస వేతనాలివ్వాలని పలుమార్లు ఆందోళనలు చేపట్టాం. కార్యకర్తల శ్రమదోపిడీ జరగకుండా వారికి కనీసం రూ.5 వేలు వేతనం అందించి వారి కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడాలని కోరుతున్నాం.
– బయ్య శంకర్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు
ఉద్యోగ భద్రత కల్పించాలి
కొన్నేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశ కార్యకర్తలు ఉద్యోగ భద్రత లేకుండా పని చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి నెలా అందించే ప్రోత్సాహకాలు కూడా అందడం లేదు. కనీస వేతనాలు అమలు చేయడమే కాకుండా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి.
– శింగమ్మ, ఆశా కార్యకర్త, స్వర్ణ సబ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment