
48 గంటలకు బంద్ కు అశోక్ బాబు పిలుపు
హైదరాబాద్: తెలంగాణ నోట్పై సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు స్పందించాలని ఏపీఎన్జీవో నేత అశోక్బాబు డిమాండ్ చేశారు. నోట్ ఇవాళ వస్తుందని తెలిసినా నిమ్మకు నీరెత్తి ఉన్నారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని రెండు నెలలుగా ఉద్యోగులు కడుపులు మాడ్చుకుని ఉద్యమం చేస్తుంటే.. రాజకీయ నాయకులు మాత్రం పదవులు కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. సీమాంధ్ర రగులుతున్నా పట్టించుకోవడంలేదన్నారు.ఈ సందర్భంగా ఆయన 48 గంటల బంద్ కు పిలుపునిచ్చారు.
రాజకీయ నాయకులంటే అసహ్యం వేస్తోందని అశోక్బాబు అన్నారు. వీరిని చూసి ప్రజలు సిగ్గు పడుతున్నారన్నారు. విభజనను సమర్థించే ఏ రాజకీయ నాయకుడిని అంగీకరించబోమన్నారు. రాజీనామా చేయని నాయకుల రాజకీయ జీవితానికి శుభం కార్డు వేస్తామన్నారు. ఇలాంటి నాయకులను ఎన్నుకోవడం తమ దౌర్భగ్యం అన్నారు. వీరిని భరించేందుకు భూమాత కూడా ఒప్పుకోదన్నారు.
పార్టీలకు అతీతంగా సీమాంధ్ర ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఎంపీలు రాజీనామా చేయకుంటే యుద్ధం ప్రకటించేందుకు ఏడు కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. శాంతియుతంగానే ఆందోళన కొనసాగిస్తామన్నారు. రాహుల్ గాంధీ మాట కోసం కేబినెట్ నిర్ణయాన్నే చెత్త బుట్టలో వేశారని అన్నారు.