నీలాద్రిగుమ్మం వద్ద శంఖంపై ఓంకారనాదాన్ని ఆలపిస్తున్న నారాయణరావు దంపతులు
సింహాచలం(పెందుర్తి): శంఖంపై నిర్విరామ ప్రణవనాదాలాపనతో పులకించింది సింహగిరి.శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చిన వరల్డ్ రికార్డ్ హోల్డర్, అమరావతి ఏఎస్పీ కె.నారాయణరావు దంపతులు ఆలయ నీలాద్రి గుమ్మం వద్ద 20 నిమిషాల పాటు ఆపకుండా శంఖంపై ఓంకారాన్ని ఆలపించారు. ఆ అమృతనాదం దేవస్థానంలో ప్రతిధ్వనించింది. అనంతరం వారు గోదాదేవికి కుంకుమార్చన చేశారు. వారికి ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదాన్ని అధికారులు అందజేశారు.
30ఏళ్లుగా అఖండ శంఖారావం
శంఖంతో వాతావరణంలో అననుకూల శక్తిని కూడా సానుకూల శక్తిగా మార్చుకోవచ్చని చెప్పా రు నారాయణరావు. మూడు దశాబ్దాలుగా దంపతులిద్దరం శంఖంపై ఓంకారాలాపన చేస్తున్నమని తెలిపారు. పశ్చిమబెంగాల్‌లోని సరిహద్దు భద్రతాదళంలో పని చేసినప్పుడు తమ ఇంటి ఎదురుగా ఉన్న డాక్టర్ చక్రవర్తి శంఖారావాన్ని పూరించేవారని, దాని ప్రాశస్త్యాన్ని తెలుసుకున్న తాము 1989 నుంచి రోజూ పూజలో శంఖం పూరించడం ప్రారంభించామని తెలిపారు. ఉత్తర భారతదేశంలో శంఖాన్ని పూరించాకే ఆలయ సింహద్వారాలను తెరుస్తారన్నారు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే యోగాలో శంఖాన్ని పూరించడం ద్వారా చాలా వ్యాధులు దూరం అవుతాయని చె ప్పారు. ఓంకార నాదాన్ని 20 నిమిషాల పాటు ఏకధాటిగా ఆలపించడం తమకు లభించిన అరుదైన రికార్డని, అది ఇప్పటికీ తమ పేరుమీదే ఉండటం అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment