హింసను సహించం.. ఎవర్నీ ఉపేక్షించం
శాంతిభద్రతలపై అసెంబ్లీలో ఏకపక్ష చర్చకు సీఎం చంద్రబాబు సమాధానం
హైదరాబాద్: రాష్ట్రంలో హింసను సహించబోమని, ఎవర్నీ ఉపేక్షించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత శాంతిభద్రతలని, ఇందులో తన, పర భేదమేమీ ఉండదని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై అసెంబ్లీలో జరిగిన ఏకపక్ష చర్చకు ఆయన శనివారం సమాధానమిచ్చారు. అయితే తన సమాధానంలో అసలు చర్చకు మూలమైన ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హత్యలపై ఎక్కడా వివరణ ఇవ్వలేదు. ఎన్నికల ఫలితాల అనంతరం తమ పార్టీ కార్యకర్తలను హత్య చేస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇవ్వగా దాన్ని స్పీకర్ తిరస్కరించడం, ఆ తర్వాత ఆ పార్టీ సభ్యులు 344 నిబంధన కింద నోటీసు ఇవ్వడం, దానిపై స్పీకర్ స్వల్పకాలిక చర్చకు శుక్రవారం అనుమతించడం తెలిసిందే. శుక్రవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆ పార్టీ సభ్యులపై అధికారపక్షం దూషణలకు దిగిన విషయం తెలిసిందే.
శనివారమూ అధికార పార్టీ సభ్యులు ఇదేవిధంగా వ్యక్తిగతంగా, నిందాపూర్వకంగా, అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తుండటంతో ప్రతిపక్షమైన వైఎస్సార్ సీపీ అభ్యంతరం తెలిపింది. అయితే, విపక్ష సభ్యులకు మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వకపోవడంపై నిరసన తెలుపుతూ వైఎస్సార్ సీపీ వాకౌట్ చేసింది. అనంతరం ఆ అంశంపై అధికార తెలుగుదేశం పార్టీ సభ్యులే చర్చను కొనసాగించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని కేంద్రబిందువుగా చేసుకుని విమర్శనాస్త్రాలు గుప్పించారు. ఆ పార్టీ సభ్యులంతా మాట్లాడిన తర్వాత చివరగా ముఖ్యమంత్రి సమాధానమిస్తూ.. అభివృద్ధిని అడ్డుకునే ఏ యత్నాన్నీ సహించబోనని అన్నారు. ‘‘మేం అధికారంలోకి వచ్చి 77 రోజులే అయింది. విపక్షం ఏ ఉద్దేశంతో ఈ అంశాన్ని ప్రస్తావించిందో తెలియడంలేదు. హత్యకు ప్రతిహత్య సమాధానం కాదు. నేటి ఆధునిక యుగంలో మనుషుల్ని చంపడం అనాగరికం. శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడం. కఠినంగా ఉంటాం. అందరూ పూర్తిగా సహకరించాలి. నాకు రాజ్యహింసను అంటగడతారా? సానుభూతి కోసం మైండ్‌గేమ్ ఆడొద్దు. ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయొద్దు’’ అని చంద్రబాబు చెప్పారు. బాబు ప్రసంగం అనంతరం సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు.