బిల్లును తిప్పిపంపే హక్కు సభకుంది
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు తప్పుల తడకగా ఉందని.. దీనిపై చర్చించటానికి తాము సిద్ధంగా లేమని.. బిల్లును శాసనసభ వెనక్కు పంపాలని ప్రధానప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శనివారం శాసనసభలో బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం కిరణ్ మాట్లాడాక చంద్రబాబు మాట్లాడారు. ‘‘తప్పుల బిల్లుపై చర్చించడానికి సిద్ధంగా లేం. రాష్ట్రపతి పంపించిన బిల్లు అయినా సరే ఈ సభ వెనక్కి పంపించవచ్చు. గతంలో బీహార్ అసెంబ్లీ అలాగే చేసింది. లోపభూయిష్టంగా ఉన్న బిల్లును తిప్పి పంపించే హక్కు ఈ సభకు ఉంది’’ అని చెప్పారు. ‘‘ఏ బిల్లు వచ్చినా సభా నాయకుడిగా ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. మీ బాధ్యత మీరు సరిగా నిర్వర్తించటం లేదు’’ అంటూ సీఎం కిరణ్‌ను ఉద్దేశించి మండిపడ్డారు.
‘‘విభజనకు సంబంధించిన బిల్లుకు అవసరమైన సమాచారాన్ని మీకు తెలిసే అధికారులు పంపించారా.? తెలియకుండా పంపించారా..? ముఖ్యమంత్రి నిస్సహాయ స్థితిలో ఎందుకున్నారు?’’ అని ప్రశ్నించారు. బిల్లులో ఉల్లంఘనలు జరిగాయని, తప్పులు ఉన్నాయని సీఎం ఎందుకు ప్రశ్నించలేదన్నారు. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు ఈ విషయాలపై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ‘‘విభజన బిల్లు తప్పుల తడక అని ముఖ్యమంత్రికి ఇప్పుడు తెలిసిందా? 23 రోజుల చర్చ తరువాత ఇప్పుడు చెప్తారా? తప్పుల తడకగా ఉన్న బిల్లును అసలు సభలో పెట్టకుండానే వెనక్కి తిప్పి పంపకుండా ఇప్పుడు ప్రస్తావించడం ఏమిటి?’’ అంటూ ప్రశ్నలు సంధించారు. ముఖ్యమంత్రి నుంచి రాష్ట్రపతి వరకు, అన్ని చట్టసభలు, సంస్థలు రాజ్యాంగానికి లోబడే నడవాల్సి ఉంటుందని, రాజ్యాంగాన్ని ఇష్టానుసారం ఉల్లంఘించడానికి వీల్లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
నా అనుమతితోనే కేంద్రానికి సమాచారం: సీఎం
చంద్రబాబు ప్రశ్నలకు సీఎం స్పందిస్తూ.. అధికారులు తన అనుమతితోనే బిల్లుకు అవసరమైన సమాచారాన్ని కేంద్రానికి ఇచ్చారని స్పష్టంచేశారు. బిల్లు సభలోకి వచ్చే రోజున అనారోగ్యం వల్ల సభకు రాలేకపోయానన్నారు. ఆ తరువాత బిల్లు మొత్తాన్ని అధ్యయనం చేశాక, కేంద్ర కేబినెట్ నియమావళిని, రాజ్యాంగాన్ని పూర్తిగా పరిశీలించిన తరువాత బిల్లు లోపభూయిష్టంగా ఉందని తేలిందని బదులిచ్చారు.
ఓటింగ్‌పై ‘రెండు’ వాదనలు
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు అసమగ్రంగా ఉందని, పూర్తి వివరాలతో సమగ్ర బిల్లును మరోసారి శాసనసభకు పంపించాలని కేంద్రాన్ని కోరుతూ.. ప్రస్తుత బిల్లును వెనక్కి పంపేందుకు వీలుగా అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు అనధికార తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ శనివారం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు నోటీసు అందచేశారు. ముసాయిదా బిల్లులో సమగ్ర సమాచారం లేనందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ అసెంబ్లీ 77వ నిబంధన కింద ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నట్లు స్పీకర్‌కు రాసిన లేఖలో టీడీపీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, మల్లేల లింగారెడ్డి తెలిపారు. మరోవైపు, వచ్చే నెల 28 వరకూ సభను పొడిగించేలా రాష్ట్రపతిని కోరుతూ సభలో తీర్మానం చేయాల్సిందిగా కోరుతూ టీడీపీ సభ్యులు గాలి ముద్దుకృష్ణమనాయుడు, లింగారెడ్డి, తంగిరాల ప్రభాకర్ ఇదే నిబంధన కింద మరో అనధికార తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ స్పీకర్‌కు లేఖ రాశారు. కాగా, రాష్ర్టపతి పంపిన బిల్లుకు 77వ నిబంధన వర్తించదని, అందువల్ల ముఖ్యమంత్రితో పాటు ఇతర సభ్యులు ఆ నిబంధన కింద ఇచ్చిన నోటీసులను తిరస్కరించాల్సిందిగా తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి స్పీక ర్‌ను కలిసి కోరారు.