ప్రైవేటు బిల్లుకు సీఎం తోడ్పడాలి
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలని కోరుతూ మా పార్టీ శాసనసభాపక్ష నేత వైఎస్ విజయమ్మ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీక ర్ తిరస్కరించినందున ప్రైవేటు బిల్లు ప్రతిపాదిస్తాం. ఈ బిల్లుపై ఓటింగ్ జరిగేలా స్పీకర్‌కు సభా నాయకుడి హోదాలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించాలి. ఆ పని చేయకుండా సమైక్యాంధ్రప్రదేశ్ కోసం పోరాడుతున్నట్లు మీడియాలో హడావుడి చేస్తే సరిపోదు.
ఇదే సమయంలో మా బిల్లుకు మద్దతివ్వకున్నా పర్లేదు.. కానీ వారి పార్టీ ఎమ్మెల్యేలతో అయినా ప్రైవేటు బిల్లు నోటీసు ఇప్పించేలా చంద్రబాబు కృషిచేయాలి. ప్రధాన ప్రతిపక్ష నేతగా విభజన తీరుపట్ల స్పందిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటేనే ప్రజలు నమ్ముతారనుకోవద్దు. దాన్ని ఆచరణలోనూ చూపాలి. టీ బిల్లు విషయంలో ప్రతి దశలోనూ కాంగ్రెస్ అధిష్టానానికి సీఎం సహకరించారు. రాష్ట్రంలోని దుస్థితికి చంద్రబాబే కారణం. ఇద్దరు కొడుకులు, కొబ్బరికాయ వంటి సిద్ధాంతాలు తెరమీదకు తెస్తూ ప్రజలను విభజన దిశగా తీసుకెళ్లిన చంద్రబాబు ప్రజాద్రోహిగా నిలిచిపోతారు. విభజనను అడ్డుకునేందుకు చివరిదశ వరకు రాజకీయంగా, క్షేత్రస్థాయిలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పోరాటం చేస్తుంది.
-వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, బాలరాజు, కాపు రామచంద్రారెడ్డి, బాబూరావు
టీడీపీ మూర్ఖపు మాటలు మానుకోవాలి
ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీకి ఒక వైఖరంటూ లేదు. మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆ పార్టీ మరిచిపోయిందా? ఇప్పుడు రాష్ర్ట ఏర్పాటును అడ్డుకుంటామంటూ మూర్ఖపు మాటలు చెప్పడం మానాలి. ఇరుప్రాంతాల్లో వైషమ్యాలు పెంచేలా సీఎం చేయడం సరికాదు.
- ఈటెల రాజేందర్(టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే)
ఆలస్యం చేస్తూ విద్వేషాలు పెంచవద్దు
అసెంబ్లీలో తెలంగాణ బిల్లును వెంటనే చర్చించి రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానిస్తూ పార్లమెంటుకు పంపించాలి. ఆలస్యం చేస్తే ఇరుప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరుగుతాయి. రాష్ట్ర విభజన ప్రక్రియను పూర్తిచేయడంతోపాటు సీమాంధ్ర ప్రజల కష్టాలను తీర్చే మార్గాలను సైతం కాంగ్రెస్ అన్వేషించాల్సి ఉంది. అధికార పార్టీ రెండు వైఖరులు విడిచిపెట్టి విభజనకు సహకరించాలి.
-గుండా మల్లేష్, కె.సాంబశివరావు(సీపీఐ ఎమ్మెల్యేలు)
అధికార పార్టీ ద్వంద్వ వైఖరి సరికాదు
టీ బిల్లు విషయంలో రాష్ట్రప్రభుత్వం, అధికారపార్టీ ద్వంద్వ వైఖరి అనుసరించడం సరికాదు. ఈ బిల్లుపై అసెంబ్లీలో వెంటనే చర్చించి ఆ ప్రక్రియను ముగించాలి. తర్వాత ప్రజా సమస్యలను సభలో ప్రవేశపెట్టి చర్చించాలి. అకాల విపత్తులవల్ల కలిగిన నష్టాల నుంచి రైతులకు ఉపశమనం కలిగించే పరిహారాన్ని అందించాలి.
- జూలకంటి రంగారెడ్డి (సీపీఎం ఎమ్మెల్యే)
సోనియాకు రాష్ర్ట ప్రజల కష్టాలు పట్టవా?
స్వలింగ సంపర్కులకు వ్యతిరేకంగా కోర్టు ఇచ్చిన తీర్పుపట్ల ఆవేదన వ్యక్తం చేసిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి 8 కోట్ల ప్రజల ఆవేదన పట్టదా? టీ బిల్లును తీసుకొచ్చిన ప్రత్యేక విమానంలో డబ్బు మూటలూ తెచ్చారు. సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొనేందుకే దిగ్విజయ్‌సింగ్ రాష్ట్రానికి వచ్చారు. ఆయన్ను రాష్ర్ట ప్రజలు తరిమికొట్టాలి.
- దేవినేని ఉమామహేశ్వరరావు, డి.నరేంద్ర(టీడీపీ ఎమ్మెల్యేలు)
తెలంగాణకు టీడీపీ కట్టుబడి ఉంది
బిల్లు పెడితే మేం పూర్తిగా సహకరిస్తాం. ప్రాంతాలవారీగా చీలిపోయి వాదనలు వినిపిస్తున్న అధికారపార్టీ వలే ్ల తెలంగాణ ఏర్పాటులో సమస్యలు నెలకొంటున్నాయి. అసెంబ్లీలో బిల్లు పాసయ్యేవరకు తెలంగాణవాదులంతా ఐక్యంగా ముందుకుపోవాలి. మా పార్టీ తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉంది.
- ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సింహులు(టీడీపీ ఎమ్మెల్యేలు)
అసెంబ్లీ మీడియా పాయింట్
Published Sat, Dec 14 2013 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM
Advertisement
Advertisement