సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీఎల్పీ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేగా తొలిరోజున శాసనసభకు వెళ్లడానికి ముందు గురువారం ఆయన నివాసంలో తన మాతృమూర్తి, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆశీస్సులు తీసుకుని బయలుదేరారు. అక్కడినుంచి క్యాంపు కార్యాలయంలోకి వచ్చిన జగన్ సహచర శాసనసభ్యులందరితో కొద్దిసేపు భేటీ అయ్యారు. అక్కడినుంచి 10.30 గంటల ప్రాంతంలో సహచర ఎమ్మెల్యేలందరితో కలిసి ప్రత్యేకబస్సులో పంజాగుట్ట వద్దకు చేరుకుని అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. అదే బస్సులో అక్కడినుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలోకి చేరుకుని అక్కడ మహాత్మాగాంధీ, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం పార్టీ కండువాలు ధరించిన ఎమ్మెల్యేలందరూ వెంట రాగా ఎదురైన వారందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. సమావేశాల ప్రారంభానికి పది నిమిషాల ముందే సభలోకి ప్రవేశించి స్పీకర్ స్థానానికి ఎడమ వైపున పార్టీ సభ్యులతో కలిసి ఆశీనులయ్యారు. విరామ సమయంలో జగన్ లాబీల్లో తనకు తాత్కాలికంగా కేటాయించిన చాంబర్ వద్దకు వస్తున్నపుడు అసెంబ్లీ సిబ్బంది ఎదురేగి ఆయనతో కరచాలనం చేయడానికి ఉత్సాహం ప్రదర్శించారు. వారిలో కొందరు దివంగత వైఎస్‌తో కూడా తమకు అనుబంధం ఉందని జగన్‌కు చెబుతూ ఆయనతో ఫోటోలు తీయించుకున్నారు. జగన్ తన చాంబర్‌లోనే అసెంబ్లీ అధికారులు ఏర్పాటు చేసిన భోజనాన్ని తీసుకుని తొలి రోజున సభ వాయిదా పడేవరకూ అక్కడే గడిపారు.